ఇస్లామాబాద్: జైలులో మా నాన్నను చంపేందుకు కుట్ర జరుగుతుందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన కుమారులు చేసిన ఆరోపణలు మరోసారి పాక్ లో రాజకీయ కుదుపును రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, ఖాసిం మాట్లాడుతూ.. అధికారులు తమ తండ్రి గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఆయన ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చని పేర్కొన్నారు. మాజీ ప్రధానికి అందిస్తున్న వైద్య చికిత్సపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారు. ఆయనను ఒక స్వతంత్ర వైద్యుడిచే పరీక్షించాలని డిమాండ్ చేశారు.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో సులేమాన్, ఖాసిం పాల్గొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు అవసరమైన వైద్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను కోరుతూ ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసిన 21 మంది ప్రముఖ మాజీ క్రికెటర్లలో అథర్టన్ కూడా ఒకరు.

ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. "తన తండ్రిని ఉద్దేశపూర్వకంగానే జైలులో ఉంచారని ఖాసిం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆరోపించారు. ఆయన నిర్బంధానికి సంబంధించిన పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. "వారు చేస్తున్న పనులను బట్టి, నాన్నను  చంపడానికి బహిరంగ ప్రయత్నం జరుగుతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. వారు తన తండ్రిని ఏకాకిగా ఉంచి, వీలైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచాలనుకుంటున్నారు. ఆయన గొంతు నొక్కేయగలమని వారు నమ్ముతున్నారు. ఇటీవల మా బంధువులు ఆయనను కలిసినప్పుడు, పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని చెప్పారు. ఆయనను రోజుకు 23 గంటలకు పైగా ఒక సెల్‌లో పూర్తిగా ఏకాంతంగా ఉంచుతున్నారు" అని ఖాసిం చెప్పాడు.