న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని సింగ్‌ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా, మృదుస్వభావిగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే ఆయన తన నైతికత, జవాబుదారీతనం కూడిన భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తారని అన్నారు. ఈ తీర్పుతో భారత రాజకీయంలో ఒక విషాదకర ఘట్టానికి ముగింపు పడిందన్నారు.

నీతినిజాయతీ కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడిందని ఓ జాతీయ వార్తా పత్రికకు రాసిన ఆర్టికల్‌లో సోనియా పేర్కొన్నారు. దివంగత నేత మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా ఒక లాబీ సమన్వయంతో పనిచేసిందన్నారు. అధికార గణం మొదలు న్యాయవ్యవస్థకు చెందిన కొందరు, పౌర సమాజం, ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి అందరూ అందులో ఉన్నారని విమర్శించారు. ఆరోపణలన్నీ బోగస్ అని నేడు రుజువైందని పేర్కొన్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు దరాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.