రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్’. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే బాక్సాఫీస్ వద్దే కాక.. ఒటిటిలోనూ ఈ సినిమా అదరగొడుతోంది. ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ.. ఈ ఏడాది ఆ ఒటిటిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన నాన్-ఇంగ్లిష్ చిత్రంగా నిచింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కొ-సిఇవొ టెడ్ సరాండోస్ వెల్లడించారు. భారతీయ కంటెంట్‌కు ప్రపంచస్థాయిలో పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసించారు.

‘‘ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన నాన్-ఇంగ్లిష్ సినిమా ‘ధురంధర్’. ఎన్నో ఇంగ్లిష్ సినిమాల కంటే దీనికే విశేష ఆదరణ దక్కింది. 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ సినిమా ఏకండా 3.7 కోట్ల (37 మిలియన్ల) వ్యూస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ చార్టులో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్’ రెండు భాగాలు కలిపి ఏకంగా రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ : ది రివెంజ్’ మరో అరుదైన ఘనత సాధించింది. భారత్‌లో రూ.1,000 కోట్లు నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘స్క్విడ్ గేమ్’, ‘మనీ హీస్ట్’ లాంటి అద్భుతాలు సృష్టించే సమయం భారత్‌కు ఎప్పుడు వస్తుందని నన్ను చాలామంది అడుగుతుంటారు. ఇండియాలో అలాంటి మూమెంట్స్ ఎప్పుడూ ఉంటాయని నేను చెబుతాను. ముఖ్యంగా ఇక్కడి సినిమాల్లో ఆ మ్యాజిక్ ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ సినిమాకు సుదీర్ఘమైన, గొప్ప చరిత్ర ఉంది’’ అని సరాండోస్ అన్నారు.