
మయన్మార్ లోని సారైంగ్ రీజియన్ లోని ఒక బౌద్ధ మఠంపై శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మయన్మార్ సైన్యం వైమానిక దాడి చేయగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారం రోజుల పాటు ఆ మఠంలో ధ్యాన శిబిరంలో పాల్గొంటున్న వారే ఈ వైమానిక దాడికి బలైపోయారని ప్రతిపక్ష వర్గం, స్థానిక నివాసి తెలిపారు. మాండలే నగరానికి సుమారు 75 కిమీ దూరంలో పశ్చిమాన ఉన్న
మయాంగ్ టౌన్‌షిప్ లోని స్వెల్ లే ఓహ్ గ్రామం లోని మఠం ప్రాంగణంపై జెట్‌ఫైటర్ బాంబు దాడి జరిగిందని మయాంగ్ టౌన్ షిప్‌కు చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ప్రతినిధి న్వేవో తెలిపారు. మయన్మార్ దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలు, జాతి ఆధారిత సాయుధ సంస్థలను లక్షంగా చేసుకుని మయన్మార్‌సైన్యం తరచుగా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో తరచుగా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.











