మెట్రో రైళ్లలో ప్రయాణికులు తోటి ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తారు. అందువల్ల పబ్లిక్ ప్రదేశాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం చాలా అవసరం. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు జరిమానా విధిస్తారు. కొన్ని తీవ్రమైన నేరాల సందర్భంలో పోలీసు కేసులు నమోదు చేయడంతో పాటు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అధిక జనాభా ఉన్న నగరాల్లో ప్రజా రవాణాను సులభతరం చేయడానికి ప్రభుత్వాలు ఈ మెట్రో వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే మెట్రోలో అమల్లో ఉన్న నిబంధనలు, వాటి ఉల్లంఘనపై పడే శిక్షల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.
భద్రత, పరిశుభ్రతను కాపాడేందుకు మెట్రోల్లో కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించడం లేదా ఇతరుల టికెట్‌ను ఉపయోగించడం నేరంగా పరిగణించబడుతుంది. దీనికి అధికారులు జరిమానా విధిస్తారు. అలాగే లగేజీ పరిమితులు కూడా ఉన్నాయి. 25 కిలోల లోపు బరువు ఉన్న సామానుకే అనుమతి ఉంటుంది.
పేలుడు పదార్థాలు, పెట్రోల్, కిరోసిన్, తుపాకులు, కత్తులు వంటి ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. మెట్రో స్టేషన్లు లేదా రైళ్లలో పొగ త్రాగడం, మద్యం సేవించడం కూడా అనుమతించబడదు. ఇలాంటి నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయవచ్చు.
తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తించడం, పెద్దగా అరవడం వంటి చర్యలు కూడా నిషేధితమే. ఇటీవల నాగోల్–రాయదుర్గం మెట్రో మార్గంలో ఒక యువకుడు కోచ్ కిటికీ గ్లాస్ స్క్రీన్‌పై కాళ్లు పెట్టి కూర్చున్న ఘటన చోటుచేసుకుంది. దీనిపై మెట్రో అధికారులు రూ.250 జరిమానా విధించడంతో పాటు పోలీసు కేసు కూడా నమోదు చేశారు.
మెట్రోల్లో నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో సంబంధిత రాష్ట్ర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం ఈ నియమాలు అమలు చేయబడుతున్నాయి.












