
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తన నివాసంలోకి కొందరు యూట్యూబర్లు, మీడియా ప్రతినిధులు అక్రమంగా ప్రవేశించి చిత్రీకరణ చేశారని ఆరోపించారు. ఈ ఘటన తన కుటుంబ భద్రతకు తీవ్ర ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది యూట్యూబర్లు, మీడియా ఛానళ్ల ప్రతినిధులు నా ఇంట్లోకి చొరబడి లోపలి దృశ్యాలను చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, నా కుటుంబ భద్రతకు కూడా తీవ్ర ప్రమాదాన్ని సృష్టిస్తోంది అని దాస్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.బుధవారం ఉదయం 15 నుంచి 20 మంది దాకా తన ఇంటి వద్దకు వచ్చారని, వారిలో కొందరు రాత్రి నుంచే అక్కడే మకాం వేశారని ఆయన తెలిపారు. ఈ వీడియోలు బయటకు రావడంతో సంఘ వ్యతిరేక శక్తులు తమపై దాడి చేసే అవకాశం ఉందని, అలాంటి ఘటన జరిగితే ఆ యూట్యూబర్లు, వారిని సమన్వయం చేస్తున్నవారే నేరుగా బాధ్యత వహించాలని హెచ్చరించారు.
యూట్యూబర్లు తన ఇంటి బయట నిలబడి తన ఆస్తులు, వ్యక్తిగత జీవితం, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 36 రోజుల పాటు సాగిన విద్యార్థుల ఉద్యమంలో తన పాత్ర గురించి చర్చిస్తున్న వీడియోల లింకులను కూడా దాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం తాను మహారాష్ట్రలో జరుగుతున్న సీజేపీ రెండు రోజుల వ్యూహాత్మక సమావేశంలో పాల్గొంటున్నానని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళనగా ఉందని ఆయన తెలిపారు.సౌరవ్ దాస్ ఆరోపణలపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ తెలిపారు. దీనికి స్పందించిన దాస్ నమస్తే ఎమోజీతో కృతజ్ఞతలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ, ఇదే మోదీ ప్రభుత్వ అసలు ముఖచిత్రం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న వ్యూహాత్మక సమావేశంలో పాల్గొన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, తమ సంస్థ రాజకీయ పార్టీగా కాకుండా యువత సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే వేదికగానే కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమానికీ మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.











