న్యూఢిల్లీ : జంతర్ మంతర్ నిరసనల సందర్భంగా తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికతోపాటు యువతను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి ఆ బాలిక తల్లి ఆదివారంనాడు ధన్యవాదాలు తెలియజేశారు. ‘మోడీజీ.. నా కూతురికి పునర్జన్మ కల్పించారు. ఆమె జీవితాన్ని కాపాడారు’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఢిల్లీలోని ఇటీవలి నిరసన కార్యక్రమంలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో సదరు బాలికపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అనంతరం ఆమె వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ, తాను చేసిన తప్పును అంగీకరించింది.

ఇకపై ఇలాంటి పొరపాటు చేయనని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిక తల్లి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ ఎంతో పెద్ద మనసుతో మా కుమార్తెను క్షమించారన్నారు. ఆయన చూపిన కరుణను జీవితాంతం మర్చిపోలేమని, మా కూతురికి కొత్త జీవితం ఇచ్చినట్లే అని అన్నారు. తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఉపసంహరించుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో తన కుమార్తె పేరు, వయస్సు వంటి వివరాలు కూడా సరిగా నమోదు కాలేదని తెలిపారు. 18ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటివి ఉపయోగించకుండా నిబంధనలు తీసుకురావాలని ఈ సందర్భంగా మోడీకి విజ్ఞప్తి చేశారు.