న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దూషించిన బాలిక తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పింది. ప్రధానిని విమర్శించిన వారి మాటలకు ప్రభావితమై తాను సైతం అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది.

తన మాటలు క్షమించరానివని, అయితే ఇదే తన మొదటి తప్పు, చివరి తప్పు అని. ఇకపై అలా చేయనని చేతులు జోడించి మరీ క్షమాపణలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన పిల్లలను క్షమాస్తానని ప్రధానమంత్రి శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశం నేపథ్యంలో బాలిక వీడియో వెలుగుచూసింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన క్లిప్ తాను పోస్ట్ చేయలేదని, ఆ వీడియో చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, సిగ్గుపడ్డానని బాలిక తెలిపింది. జూలైలో తాను మిత్రులతో కలిసి కన్నాట్‌ప్లేక్‌కు వెళ్లానని వెల్లడించింది. అక్కడ కొందరు ప్రధానని తిట్టారని, తనను కూడా విమర్శించమని ప్రోత్సహించడంతో తాను కూడా అదేపని చేశానని తెలిపింది. తన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని, దేశ ప్రజలంతా దయజేసి తనను క్షమించాలని ఆమె వేడుకుంది. తన వయస్సు కేవలం 15 ఏళ్లేనని, ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని తెలిపింది.

మోడీపై చేసిన వ్యాఖ్యలకు గాను నొయిడా పోలీసులు ఈనెల 29న బాలికపై కేసు నమోదు చేశారు. తొలుత జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అనంతరం కేసును న్యూఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వీడియోను తొలగించాలంటూ స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్ అధికారులు సామాజిక మాధ్యమం ఎక్స్‌కు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో బాలిక క్షమాపణలు చెప్పింది. అయితే ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో బాలిక వయస్సు 25 ఏళ్లుగా నమోదు చేశారు.