
ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
హైకమాండ్ పెద్దలతో నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం
మంత్రివర్గ విస్తరణపైనా మంతనాలు?
మన తెలంగాణ/హైదరాబాద్‌ః నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసిసి అగ్ర నేతలతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం మంతనాలు జరపనున్నారు. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ చర్చలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు.
ఇందులో భాగంగానే ఏఐసిసి పెద్దలతో నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు. రెండేళ్ళ క్రితం ముప్పై కార్పొరేషన్లకు చైర్మన్ల పదవులను, వాటికి డైరెక్టర్లను నియమించారు. వీటిలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్నింటి పదవీ కాలం పూర్తయ్యింది. పదవీ కాలం పూర్తయిన వారిలో ఎంత మందికి తిరిగి వారి పదవుల కాలాన్ని పొడిగించడం (రీ-అపాయింట్‌మెంట్), కొత్తగా ఎవరెవరికి ఛాన్స్ కల్పించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మీనాక్షి నటరాజన్‌తో ఇటీవల పిసిసి చీఫ్ సమావేశమై కసరత్తు చేశారు. అనంతరం వారు ముఖ్యమంత్రితో సమావేశమై చివరకు ఒక జాబితాను రూపొందించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్టీసీ, పర్యాటక శాఖ, డెయిరీ వంటి కొన్ని కీలకమైన కార్పొరేషన్లకు పోటీ అధికంగా ఉండడంతో మూడేసి పేర్లతో జాబితా రూపొందించారు.
టిజి-ఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గా రెడ్డి పదవీ కాలం పది రోజుల క్రితం ముగిసింది. అయితే తిరిగి తన సతీమణికే ఇవ్వాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీనాక్షి నటరాజన్‌ను, మహేష్‌కుమార్ గౌడ్‌ను కోరినట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేతలందరికీ నేరుగా చైర్మన్ పదవులు ఇవ్వలేం కాబట్టి ఆయా కార్పొరేషన్లను డైరెక్టర్లుగా, మెంబర్లుగా నియమించాలని వారు నిర్ణయించారని సమాచారం. ఇటీవల పదవీ కాలం ముగిసిన వారిలో ముఖ్యులకు రెన్యూవల్ చేయకుండా మొత్తం కొత్త వారికే ఇవ్వడం సాధ్యం కాదన్న భావనతో పార్టీ నాయకులు ఉన్నారు.
మంత్రివర్గ విస్తరణపైనా చర్చ?
ఏఐసిసి ముఖ్యులు ఏలాగైనా ‘సర్’ ప్రక్రియ గురించి అడుగుతారని భావించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దానిపై ఇప్పటి వరకు చేసిన కసరత్తు, బిఎల్‌వోలకు ఇచ్చిన ట్రైనింగ్ వంటి అంశాలను క్రోడీకరించి ఓ నివేదిక సిద్దం చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల పురోగతి, ఇటీవల రెండు, మూడు జిల్లాల్లో నెలకొన్న విభేదాలను రూపుమాపేందుకు తీసుకున్న చర్యల గురించి అధిష్టానానికి పిసిసి చీఫ్ వివరించనున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ (పునర్ వ్యవస్థీకరణ)పైనా ఏఐసిసి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.











