
హైదరాబాద్: తాము ముళ్ల కర్రతో పొడిచే వరకు సిఎం రేవంత్ రెడ్డి కు సమస్యలు తెలియట్లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తాము పాలమూరుకు వస్తున్నామని చెప్పగానే పంపులు ఆన్ చేశారని అన్నారు. కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాగాలు చేస్తే తప్పేమీ లేదని.. యాగాలతో పాటు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని సూచించారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం పట్ల ఏ మాత్రం పట్టింపు లేదని, సిఎం దృష్టిలో భూమి అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే అని కెటిఆర్ విమర్శించారు. సిఎం కు సోయి లేకపోవడం వల్లే తాము చెప్పేవరకు పంపులు ఆన్ చేయలేదని, నీళ్ల విషయంలో మళ్లీ ఉద్యమం చేసే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. క్షుద్ర పూజలు అంటూ.. కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు చేస్తోందని, మాజీ మంత్రి హరీష్ రావు గుడికి వెళ్తే చిల్లర కామెంట్స్ చేశారని ధ్వజమెత్తారు. నీళ్లు ఉండి రైతులను ఎండబెట్టే సంస్కృతి బిఆర్ఎస్ ది కాదని అన్నారు. 24 గంటలు కరెంటు ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు ఏ సబ్ స్టేషన్ కు రమ్మంటారో చెప్తే అక్కడికి వచ్చి చూస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.








