
ప్రశ్నించడమే కాదు, పరిష్కారాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలి
ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వికసిత్ భారత్ ప్రయాణంలో యువత సామర్థ్యాలు కీలకం
న్యూఢిల్లీ: దేశ యువత సామర్థ్యాలపై తనకు ఎంతో నమ్మకం ఉందని, వికసిత్ భారత్ ప్రయాణంలో యువత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత సాధికారతే దేశ సాధికారికత అని అన్నారు. ప్రతి తరానికి జాతీయ బాధ్యత ఉంటుందని, దేశాన్ని విస్మరించరాదని సూచించారు. కేవలం ప్రశ్నించడం ఒక్కటే కాకుండా, సమస్యకు పరిష్కారం కనుగొనే ధైర్యం ఉండాలని, దేశానికి ఏమి చేయగలని ప్రశ్నించు కోవాలని, అప్పుడే యువత తమకెదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలుగుతారని ప్రధాని దిశానిర్దేశం చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 3 వేల మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీ పట్టాలు అందజేశారు. వీరిలో 587 మంది పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్ మెడల్, డైరెక్టర్స్ గోల్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్ మెడల్ ప్రదానం చేశారు. పెర్‌ఫెక్ట్ గోల్ మెడల్స్ ను కూడా విద్యార్థులకు అందజేశారు.
ఐఐటీ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్బంగా మోదీ అన్నారు. ఈరోజు నుంచి మీ కొత్త ప్రయాణం మొదలవుతోంది. ఇది కేవలం డిగ్రీలు తీసుకోవడం కాదని, దేశ స్వప్నాలను సాకారం చేసే బాద్యతను స్వీకరించడమని అన్నారు. ప్రతి విద్యార్థికి జీవితంలో ఎన్నో కలలు, లక్ష్యాలు ఉంటాయన్నారు. లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ అనుకున్న గమ్యాన్ని చేరేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఐఐటీలో నేర్చుకున్న విద్య, నైపుణ్యాలను దేశాభివృద్ధికి వినియోగించాలని కోరారు.
ఇప్పుడే చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారని, అయితే బయట ప్రపంచం చాలా వేగంగా మారుతోందని మోదీ వివరించారు. సాంకేతికత నుంచి పలు రంగాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. అయితే విద్యార్థులు ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలని, అలాంటి వారే విజేతలుగా నిలుస్తారని మార్గనిర్దేశనం చేసారు. పతకాలు అందుకున్న వారిలో ఇకరిద్దరే మహిళలు ఉండటాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, వీరి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేదని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ సోనిపత్ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటిక్ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ను మోదీ ప్రారంభించారు. కృత్రిమ మేధ (ఏఐ), పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ సదుపాయం దోహదపడనుంది.











