మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ’గ్లింప్స్’, పాటలతో ఆసక్తిని రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో ’ఇరుముడి’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రవితేజ స్వయంగా హాజరుకానుండటంతో, ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఘట్టం కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు.

ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సినిమా కథలోని భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాలనే ఎక్కువగా చూపించారు. ఇప్పుడు ట్రైలర్ ద్వారా రవితేజ పాత్ర ఏమిటి? ఇతర కీలక పాత్రలతో ఆయన సంబంధం ఎలా ఉంటుంది? అసలు కథను నడిపించే పరిస్థితులు ఏమిటి? అనే విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో శివ నిర్వాణ భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలను ఎలా మిళితం చేశారో కూడా ట్రైలర్ చూపించనుంది. ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.