
ఐక్యరాజ్యసమితి: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనలు తెలుపుతున్న వారికి హాని జరిగితే అందుకు బాధ్యులైన వారిపై జవాబుదారీతనం ఉండాల్సిందేనని ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్ తరఫున డిప్యూటీ అధికారి ఫర్హాన్ హక్ అన్నారు. ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని, ఆ హక్కును ప్రభుత్వాలు గుర్తించాలని, పీఓకే విషయంలోనూ ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
జూలై 27న పీఓకే అసెంబ్లీ తొలివిడత ఎన్నికల సమయంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్యర్యంలో నిరసనలు చోటుచేసుకున్నాయి. శరణార్థులకు సీట్ల కేటాయింపు, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జూన్ మొదటి వారం నుంచి ఇంతవరకూ 400 మంది నిరసన కారులను మట్టుబెట్టారని జేఏఏసీ చెబుతోంది. ఆగస్టు 2న జరిగిన రెండో విడత పోలింగ్‌లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 10న మూడో దశ పోలింగ్ జరగాల్సి ఉండగా, ఏడు స్థానాల్లో ఓటింగ్‌ను అధికారులు నిరవధికంగా వాయిదా వేశారు. పీఓకేలో హింసాత్మక ఘటనలను భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సైతం నిరసనకారులపై పాక్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. జవాబుదారీతనం అవసరమని స్పష్టం చేసింది.











