
చెన్నై: వైద్యకోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షను తొలినుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎం విజయ్ నేతృత్వం లోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి కె. అరుణ్‌రాజ్ మంగళవారం ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు. దీనికి ప్రధాన విపక్షాలైన డీఎంకే, ఏఐఎడీఎంకె మద్దతు తెలిపాయి. టీవీకేకు మిత్ర పక్షాల నుంచి ఎలాగూ మద్దతు ఉంది. ఒక్క బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసింది.
తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆరోగ్యమంత్రి అరుణ్‌రాజ్ మాట్లాడారు. “ కేంద్ర ప్రభుత్వం నీట్ ను రద్దు చేయాలి. ఈ ప్రవేశ పరీక్ష వల్ల విద్యార్థుల దృష్టి కోచింగ్ సెంటర్ల వైపు మళ్లింది. ఫీజులు భారీగా వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయి. దీంతో గ్రామీణప్రాంతాల్లోని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.” అని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల హక్కులకు ఈ పరీక్ష వ్యతిరేకం అనే విషయాన్ని తమిళనాడులోని ప్రతి ప్రభుత్వం వాదిస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. 12 వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం ఉండాలని విజయ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో డీఎంకె ఇదే ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. నీట్‌పేపర్ లీక్ అంశాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం తీర్మానంలో ప్రస్తావించింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ పరీక్ష ఒత్తిడి కారణమని పేర్కొంది. నీట్ రద్దు తోనే వాటికి ముగింపు వస్తుందని అభిప్రాయపడింది.











