ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో.. డబ్బుల కోసమో పార్టీ మారలేదని... నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని పోచారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ కాగా.. మరికొంతమంది కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. దీంతో బిఆర్ఎస్ నాయకులు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర స్పీకర్ ను, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే, పార్టీ మారడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని.. కానీ తప్పలేదన్నారు. తాను జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని.. కాంగ్రెస్‌ జెండా కాదని చెప్పారు. ఆరు నెలల్లో పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ, పార్టీ మారాక సగం నిధులే మంజూరు చేశారని.. నిధుల కోసం అడుగుదామంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదని పోచారం పేర్కొన్నారు.