
బెంగళూర్‌లో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పై మాట్లాడారు. “ సర్ ” తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో నాది కూడా ఉంది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఈ నియోజకవర్గం లోనే పుట్టాను. ఇక్కడే నివసించాను. చదువంతా ఇక్కడే పూర్తయింది. నటన నేర్చుకుంది కూడా ఇక్కడే. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయినా నా ఓటును తొలగించారు. ” అని ఆ వీడియోలో చెప్పారు. మళ్లీ ఓటరు కార్డు పొందడానికి ఏ డాక్యుమెంట్లు
అడుగుతారో అని వ్యంగ్యంగా అన్నారు. తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. “ మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీకు ఉండొచ్చు. కానీ మిమ్మల్ని అధికారం నుంచి దింపకుండా మమ్మల్ని ఆపగలరా ? ’ అని గేమ్ ఆన్ అంటూ ప్రశ్నించారు. ఇక ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు ఉన్నాయనే ఆరోపణలపై ఇటీవల బెంగళూరులో కేసు నమోదయ్యింది. నోటీసులకు స్పందించక పోవడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ కేసులో జులైలో బెంగళూరు కోర్టు ముందు ప్రకాశ్ రాజ్ హాజరు కాగా, వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.











