
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంగళవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టెస్సరాక్ట్ కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారని, అయితే కొండల్‌రెడ్డి స్వయంగా తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో టెస్సరాక్ట్ చైర్మన్‌గా పేర్కొన్నారని కెటిఆర్ అన్నారు. యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ కూడా ఆయనను టెస్సరాక్ట్ చైర్మన్‌గా పేర్కొన్నప్పుడు మంత్రి ఎలా సంబంధం లేదని చెబుతున్నారని అడిగారు. మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలియదా..అంటూ మంత్రి శ్రీధర్‌బాబును వ్యాఖ్యానించారు. కేవలం టెస్సరాక్ట్ వ్యవహారం మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన ఇతర వ్యాపారాలు, భూములు, ఒప్పందాలు, కాంట్రాక్టులపైనా గతంలో తాము ప్రశ్నలు లేవనెత్తామని అన్నారు.
ముఖ్యమంత్రి మరో సోదరుడు అనుముల జగదీష్‌రెడ్డి అమెరికాలో ఉండగా, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఒప్పందానికి సంబంధించిన ఎంఓయూ జరిగిందని పేర్కొన్నారు. ఆ ఒప్పందం తర్వాత ఆ సంస్థకు ఎక్కడైనా భూములు కేటాయించారా.. పెట్టుబడులు వచ్చాయా..? అనే అంశాలను కూడా వెలికి తీస్తామని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డికి సంబంధించిన రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులపై గతంలోనే ప్రశ్నలు లేవనెత్తామని గుర్తుచేశారు. సింగరేణి, సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, ఇతర కాంట్రాక్టుల్లోనూ అక్రమాలు జరిగాయని తాము గతంలో ఆధారాలతో సహా ప్రజల ముందుంచామని అన్నారు. ఇప్పుడు టెస్సరాక్ట్ వ్యవహారం అదే పరంపరలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశమని పేర్కొన్నారు.











