డంబుల్లా: శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ మహిళ క్రికెట్ జట్టు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. గతంలో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఆ జట్టు తాజాగా మూడు టి-20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో కోల్పోయింది.

డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో శ్రీలంక.. పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక బౌలింగ్‌లో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు.

అనంతరం శ్రీలంక 176 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 17.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో సంజనా 46, ఆటపట్టు 40, హర్షిత 37 (నాటౌట్), విష్మి 31 పరుగులు చేశారు. పాక్ బౌలింగ్‌లో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజనాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.