
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబందించి త్వరలోనే శుభవార్త వినబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి కింద 90 టిఎంసిలు నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు సంబందించి 30 టిఎంసీల నీటి కేటాయింపులపైన కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని సిఎం వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని ఐటి పార్కులో అమర రాజా కంపీనికి చెందిన కష్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటును ప్రారంభించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న డిండి,పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్, ఆర్‌డిఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి సమస్యలు పరిస్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులను సంపూర్ణమైన అనుమతులు సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సశ్యశ్యామలం చేసే బాద్యత తీసుకుంటానని చెప్పారు.













