
హన్మకొండలోని నివాసంలో ఉదయం మాజీ ఎంఎల్‌ఎ సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పలుమార్లు సిపిఆర్
తొమ్మిదోసారికి ఫలించిన వైద్యురాలు మమత ప్రయత్నం
కెసిఆర్ ఆదేశాలతో హన్మకొండకు కెటిఆర్, హరీశ్‌రావు
మెరుగైన వైద్యం కోసం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలింపు
సికింద్రాబాద్ యశోదలో కొనసాగుతున్న చికిత్స
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, పార్టీ నేతలు హుటాహుటిన వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్స మొదలు పెట్టామని పేర్కొన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణించినట్లు వచ్చిన వదంతులు నిజం కాదని తెలిపారు.
పలుమార్లు సిపిఆర్ చేసి పెద్ది ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమత
గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్‌రెడ్డిని ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ మమతారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. పలుమార్లు సిపిఆర్ చేయగా, 9వ సారికి సిపిఆర్ ఫలించి గుండె లయ వచ్చింది. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అని డాక్టర్ మమతారెడ్డి పేర్కొన్నారు. ఆమెకు అక్కడ ఉన్న అభినందనలు తెలిపారు.
యశోద ఆసుపత్రిలో చికిత్స
పెద్ది సుదర్శన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం ఆయనకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసింది. సుదర్శన్‌రెడ్డి అంబులెన్స్ వెంటే మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు నగరానికి వచ్చారు. యశోద ఆసుపత్రిలో ఉండి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కెసిఆర్ ఆరా
మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆరా తీశారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలి-- కెటిఆర్‌ను ఆదేశించారు. ఆయన వెంటే ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలిని కెటిఆర్‌ను ఆదేశించారు. సుదర్శన్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెందిన కెసిఆర్ ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేశారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కెటిఆర్, హరీశ్ రావు, వినోద్‌కుమార్, జిల్లా నేతలతో కెసిఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేశారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆరోగ్య సమాచారాన్ని, మెరుగైన చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నాలను డాక్టర్లు కెసిఆర్‌కు వివరించారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నది
వైద్యురాలిని ప్రశంసించిన హరీష్‌రావు
పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన డాక్టర్ మమతకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయనకు పలుమార్లు సిపిఆర్ చేసి గుండె లయ సరిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మమత లాంటి వారు వైద్య వృత్తి ఉన్నతమైనదనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్లు భూమిపై ఉన్న దేవళ్లతో సమానం అని కీర్తించారు. పెద్ది సుదర్శన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసింది: వినోద్‌కుమార్
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆసుపత్రి ప్రాంగణంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి అన్నింటిని అధిగమించి ప్రాణపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనికి సుదర్శన్ రెడ్డి అభిమానులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు సహకరించాలని కోరారు.











