
మన తెలంగాణ/హైదరాబాద్: సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే వారి జోలికి హైడ్రా వెళ్లదని, పార్క్‌లు, చెరువులు, నాలాలను కబ్జాలు చేసే వాళ్ల వీపు సున్నం అవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. వనస్థలిపురంలో గుడి స్థలాన్ని కబ్జా చేస్తే హైడ్రా విడిపించిందని, కొన్నిచోట్ల చెరువులను కబ్జా పెడితే నీళ్లు వెళ్లడానికి స్థలం లేక బస్తీల్లోకి వస్తున్నాయని, కొద్ది మంది కబ్జాలు చేస్తే వేలాది మంది ప్రజలు కష్టాల పాలవుతున్నారని, కబ్జాదారులు ఎంతటివారైనా ప్రభుత్వం వదలదని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గుర్రంగూడ ఎకో పార్క్ లో మొక్క నాటి వనమహోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎకో పార్క్ లో రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సైతం సిఎం ప్రారంభించారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాల పల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17. 66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం గుర్రంగూడ ఎకో పార్క్ ఫొటో ప్రదర్శనను సిఎం రేవంత్‌రెడ్డి తిలకించారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపి మధుయాష్కీ, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎకో పార్క్‌కు ఎన్ని నిధులైనా ఇస్తాం
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చెరువులు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీస్తామని, గుర్రంగూడ ఎకో పార్క్ కు ఎన్ని నిధులైనా ఇస్తామని, అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఆనాటి పాలకులు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ సంస్థలను నిర్మించకపోతే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేది కాదన్నారు. శంషాబాద్ విమానాశ్రయం భూ సేకరణలో దేవేందర్ గౌడ్ కృషి ఎంతో ఉందన్నారు. సిరీస్ కంపెనీ దెబ్బకు ఎల్‌బినగర్ ప్రాంతంలో నీరు కలుషితం అయ్యిందని, భూములు విలువలు లేకుండా పోయాయని మూసీ కాలుష్యం వల్ల ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడ్డారని, సిరీస్ కంపెనీని వదిలించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని సిఎం పేర్కొన్నారు.
ఎవరూ ఏడ్చినా భారత్ ఫ్యూచర్ సిటీని కడతాం
ఎవరూ ఏడ్చినా భారత్ ఫ్యూచర్ సిటీని కడతామని, అంతర్జాతీయ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తామని, భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని చర్చించునేలా నిర్మిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే వద్దంటున్నారని, అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలని, ఫ్యూచర్ సిటీ వద్దని కొందరు పేర్కొంటున్నారని, బిఆర్‌ఎస్ వాళ్ల ఫ్యూచర్‌ను ప్రజలు ఎప్పుడో రద్దు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ లేని వాళ్లు అంతా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుకుందామా..? అని ఆయన ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ వద్దంటున్నారని వారు వస్తే సలాకీ కాల్చి వాతపెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, 60 శాతం పచ్చదనం ఉంటుందని, దీనిని అడ్డుకోవడానికి హైకోర్టులో, ఎన్జీటీల్లో కొందరు కేసులు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీలో ఉన్న కాలుష్యం కంటే కల్వకుంట్ల కడుపులోనే ఎక్కువ కాలుష్యం
మూసీ ప్రక్షాళన చేయాలని, చెరువులను కబ్జాల నుంచి విడిపించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అయితే మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోసం అమ్ముడుపోయిన ఆయన కూడా మూసీ గురించి మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మూసీలో ఉన్న కాలుష్యం కంటే కల్వకుంట్ల వారి కడుపులోనే ఎక్కువ కాలుష్యం ఉందన్నారు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లాలో పుట్టబోయే బిడ్డలు కాళ్లు వంకరపోతున్నాయని, అందుకే అక్కడి ప్రజలు వలస పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు విషంలోనే బ్రతకాలని, వారు మురికిలోనే ఉండాలని వాళ్లు అంటున్నారని, అయినా, తాము మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని, గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ స్థాయిలో మూసీని అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని, గతంలో మూసీ నదిలో నివసించిన వాళ్లను నందనవనం కాలనీ కట్టి అక్కడికి తరలించారని, ఇప్పుడు నందనవనం కాలనీ చాలా కీలకంగా మారిందని ఆయన తెలిపారు.
ఎల్‌బినగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేక అభిమానం
ఎల్‌బినగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే తనకు ప్రత్యేక అభిమానమని సిఎం తెలిపారు. 2018 శాసనసభ ఎన్నికల్లో రాజకీయకుట్రవల్ల కొడంగల్ లో ఓడిపోయినప్పుడు చాలా మంది నవ్వుకున్నారని, సోనియా, రాహుల్ అండ గా నిలబడి మల్కాజ్‌గిరి ఎంపిగా తనకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఎల్‌బినగర్‌కు వచ్చినప్పుడు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందన్నారు. ఇక్కడిప్రజలు మావాడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అ య్యారని అభిమానంతో పలకరిస్తారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒక వైపు మాత్రమే అభివృద్ధి జరిగిందని, ఎల్‌బినగర్, బిఎన్‌రెడ్డి, వనస్థలిపురం, గుర్రంగూడ లాంటి ప్రాంతాలు అభివృద్ధి కాలేదన్నారు. ఈ ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని పాలకులు ఆలోచించలేదని, ఈ ప్రాంతంలో రూ.2,400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామన్నారు.
424 ఎకరాలను నేషనల్ పార్క్‌గా
గుర్రంగూడ ఎకో పార్క్‌ను ప్రైవేటు భూములుగా చూపించి లేఔట్లు చేసి కొందరు అమ్ముకోవాలని ప్రయత్నం చేశారని సిఎం ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కోర్టులో కేసు గెలిచామని, గుర్రంగూడలో 424 ఎకరాలను నేషనల్ పార్క్‌గా ఇక్కడి ప్రజలకు అంకితం ఇచ్చామని ఆయన తెలిపారు. సరూర్‌నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలు వరదల్లో మునిగిపోయాయని, కబ్జాదారుల కోరలను పీకాలని హైడ్రాను తీసుకువచ్చానని ఆయన పేర్కొన్నారు.












