మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్), అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి. వి. శ్రీనివాస్‌రావు శనివారం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్ ప్రకటించారు. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత నెల 29న విడుదల చేసిన నాలుగు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నామని, దరఖాస్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, ఇతర మార్గాల్లో వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు.

సివిల్, రిజర్వ్, ఎస్‌పిఎఫ్ ఎస్సై, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులకు రూ.1,500 ఫీజు నిర్ణయించారు. అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు కూడా ఇదే ఫీజు వర్తించనుంది. ఈ పోస్టులకు ప్రత్యేక సాంకేతిక పరీక్ష నిర్వహిస్తారు. సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్‌సిపిఎల్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌పిఎఫ్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతరులకు రూ.1,200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్), పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. అయితే వీరికి అదనంగా డ్రైవింగ్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లు లేదా పోస్టులకు దరఖాస్తు చేసినా, శారీరక కొలతలు (పిఎంటి), శారీరక సామర్థ్య పరీక్ష (పిఇటి) ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ఆ పరీక్షల ఫలితాలను అభ్యర్థి దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు వర్తింపజేస్తారు. అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ కామన్ ప్రొసీజర్ రెజిమెన్‌లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫీజులో రాయితీ కూడా కల్పించారు. ఓసి, బిసి అభ్యర్థులకు ప్రతి అదనపు రెజిమెన్‌పై రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50 చొప్పున తగ్గింపు లభిస్తుంది.

ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ తప్పనిసరి

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లలో ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫేస్ ఆథెంటికేషన్‌కు సిద్ధంగా ఉండాలని టిఎస్‌ఎల్‌పిఆర్‌బి సూచించింది. దరఖాస్తు అనంతరం ప్రింట్ కాపీని భద్రపరచుకోవాలని తెలిపింది. నియామకాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని బోర్డు ఛైర్మన్ స్పష్ట చేశారు.