రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టం

౮౭ జలాశయాల్లో 40.89 శాతం వరకు చేరిన నీటి నిల్వలు

ఆల్మట్టి నారాయణ్‌పూర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పరవళ్లు

జూరాల మీదుగా శ్రీశైలానికి భారీగా వరద

గోదావరి బేసిన్ జలాశయాల్లో 142 టిఎంసిల చేరిక 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం అడుగంటిన ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళను సంతరించుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 40 శాతాన్ని దాటాయి. 87 జలాశయాల్లో పూర్తి సామర్థ్యమైన 1,059 టిఎంసీలకు గాను ప్రస్తుతం 40.89 శాతం మేర 433.15 టిఎంసీల నీరు నిల్వ ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది.

ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల పెరగడంతో జూరాల మీదుగా శ్రీశైలానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 62 టిఎంసీల వరద నీరు జలాశయంలోకి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 100 టిఎంసీలకు చేరువైంది. పూర్తి సామర్థ్యం 215.81 టిఎంసీలకు గాను ప్రస్తుతం 93 టిఎంసీలకు పైగా నీరు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,53,543 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ఫ్లో 924 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 859.30 అడుగులకు చేరింది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 215.807 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 103.89 టిఎంసీలుగా ఉంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

గోదావరి బేసిన్ జలాశయాల్లో 142 టిఎంసీలు

గోదావరి బేసిన్ జలాశయాల్లో 142 టిఎంసీలు, కృష్ణా బేసిన్ జలాశయాల్లో 290 టిఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకుతోడు పైనుంచి వచ్చిన వరదతో ఎస్సారెస్పీలో ప్రస్తుతం 33.14 టిఎంసీల మేర నీరు ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.74 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 3.5 టిఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.18 టిఎంసీలకు గాను ప్రస్తుతం 19.18 టిఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలతో మిడ్ మానేరులో నిల్వ పెరుగుతోంది. మిడ్ మానేరు పూర్తి సామర్థ్యం 27.55 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 14.23 టిఎంసీల నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరు పూర్తి సామర్థ్యం 24.03 టిఎంసీలకు గాను ప్రస్తుతం 5.62 టిఎంసీల నీరు ఉంది.

నిండుకుండలా కర్ణాటకలోని ప్రాజెక్టులు

కృష్ణా బేసిన్‌లోని కర్ణాటకలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో దిగువకు నీటిని వదలడంతో జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టిఎంసీలకు గాను ప్రస్తుతం 7.72 టిఎంసీలకు చేరుకుంది. జూరాలకు లక్షా 76 వేల క్యూసెక్కులు వస్తుండగా, లక్షా 55 వేల 851 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 136.99 టిఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 900 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. జైక్వాడి ఇన్‌ఫ్లో 36,157 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 2,538 క్యూసెక్కులతో ప్రవహం ఉంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.18 టిఎంసీలు, ప్రస్తుతం 18.73 టిఎంసీల నీరు జలాశయంలో ఉంది. ఇన్‌ఫ్లో 8,336 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో16,048 క్యూసెక్కులుగా నమోదయ్యింది.

సింగూరులో ప్రస్తుతం 4.2 టిఎంసీల నీరు

మంజీరాకు వరద నీరు రావడం లేదు. సింగూరు పూర్తి సామర్థ్యం 29.92 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 4.2 టిఎంసీల నీరు ఉంది. నిజాంసాగర్ పూర్తి సామర్థ్యం 17.8 టిఎంసీలు కాగా ప్రస్తుతం 8.43 టిఎంసీల నిల్వ ఉంది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 3,01,190 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. సమ్మక్క బ్యారేజీ వద్ద 4,45,670 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద 7,12,676 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.