నందిగామ సిఐ వీరబాబు

మన తెలంగాణ/నందిగామ: యువతి ప్రేమను నిరాకరించిందనే తీవ్ర మనస్థాపంతో యువకుడు సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామంలో చోటు చేసుకుంది. నందిగామ సిఐ వీరబాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ (19) అనే యువకుడు గత మూడు నెలల క్రితం నందిగామ సమీపంలో ఉన్న ఎంఎస్‌ఎన్ పరిశ్రమలో రోజువారి కూలీ పనికోసం వచ్చినట్లు తెలిపారు. మేకగూడ గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పనిచేసుకుంటూ ఉన్నట్లు సిఐ వివరించారు. బిహార్ రాష్ట్రంలో సూరజ్ కుమార్ నివసిస్తున్న గ్రామంలోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఆ యువతి ప్రేమను నిరాకరించడంతోనే తీవ్ర మనస్థాపం చెంది ఫ్యాన్‌కు తువాలతో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు సిఐ వీరబాబు తెలిపారు. లేబర్ కాంట్రాక్టర్ రాంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వివరించారు.