
బొగోటా: పెరూలోని నజ్కా సిటీ సివార్లలో పర్యాటకుల విమానం కుప్పకూలింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పెయిన్, ఏడుగురు ఇటలీ, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రఖ్యాత నజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూసేందుకు వీరంతా విమానం ఎక్కారు. పెరూవియన్ కంపెనీ ఏరోడియానా ఆపరేట్ చేస్తున్న విమానం శనివారంనాడు ఐకా నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక పొలంలో కుప్పకూలినట్టు నజ్కా మునిస్పిల్ గవర్నమెంట్ ధ్రువీకరించింది.
అయితే తమ సంస్థ 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాలను ఉపయోగించి విజయవంతంగా సర్వీసులను నడుపుతున్నట్టు పెరూవియన్ కంపెనీ ఏరిడియాన్ తెలిపింది. పర్యాటక విమాన దుర్ఘటనపై పెరూ అధ్యక్షుడు ఫుజుమోరి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. పెరూ ఎడారి నేల మీద వేల ఏళ్ల కిందట చెక్కిన నాజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూడటం పర్యాటకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుంటుంది.











