ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ని మదురా ద్వీపం సమీప సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 41 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరికొందరిని సురక్షితంగా కాపాడారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరమైన తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్‌కు వెళ్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంటల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు ప్రయాణికులు ఫెర్రీ నుంచి సముద్రంలోకి దూకడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.