శాసనం, న్యాయం, పాలన... ఈ మూడింటికీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత పీఠాలు ఉన్నాయి. వాటిని నడిపించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశానికి వెన్నెముక వంటివారు. కానీ, ఇటీవలి పరిణామాలు, వరుస వివాదాలు, అవినీతి కుంభకోణాలు ఈ వ్యవస్థల ప్రతిష్ఠపై మచ్చ తెస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం సహా అనేక ఘటనలు దేశవ్యాప్తంగా అధికారుల నైతిక దిగజారుడుపై తీవ్ర చర్చకు దారితీశాయి. యూపీఎస్సీ వంటి అత్యున్నత పరీక్షల్లో ఉత్తీర్ణులై, కోట్ల మందికి ఆదర్శంగా నిలవాల్సిన కొందరు అధికారులు దారితప్పుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాసేవ, నిజాయితీ, నిష్పాక్షికతలను పక్కనబెట్టి అవినీతి, అక్రమ సంపాదన, వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలు, బ్లాక్మెయిలింగ్లు మరియు అక్రమ మైనింగ్ వంటి క్రిమినల్ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. దేశాన్ని కుదిపేసిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ వివాదాలను గమనిస్తే..గత రెండు దశాబ్దాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలువిచారించిన కొన్ని కీలక కేసులు ఈ విలువల సంక్షోభాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో నాటి డైరెక్టర్ అలోక్ వర్మ , స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పరస్పరం కోట్లాది రూపాయల లంచం ఆరోపణలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదంతో ప్రభుత్వం ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది. పూజా సింఘల్ (ఐఎఎస్ - జార్ఖండ్): మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయగా, దర్యాప్తులో భారీగా నగదు స్వాధీనం చేసుకుంది.బి. చంద్రకళ (ఐఎఎస్ - ఉత్తరప్రదేశ్): అక్రమ ఇసుక తవ్వకాల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు.

అర్వింద్ జోషి & టినూ జోషి (ఐఎఎస్ దంపతులు - మధ్యప్రదేశ్): 2010లో దాడుల సందర్భంగా వీరి నివాసాల నుంచి కోట్లాది రూపాయల నగదు, బంగారం లభ్యమయ్యాయి.రాజేంద్ర కుమార్ (ఐఎఎస్ - ఢిల్లీ) & ప్రదీప్ శర్మ (ఐఎఎస్ - గుజరాత్): కాంట్రాక్టులు, భూ కేటాయింపుల్లో అవకతవకలు మరియు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొన్నారు.బి.కె. బన్సాల్ పై తీవ్ర అవినీతి ఆరోపణల దర్యాప్తు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు విషాదాంతంగా ముగిశాయి. ఇక ఐపీఎస్ అధికారులు - క్రిమినల్ / దర్యాప్తు వివాదాల విషయానికొస్తే.. డి. జి. వంజారా (ఐపిఎస్ - గుజరాత్): పలు ఎన్కౌంటర్ కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొని సుదీర్ఘకాలం జైలులో ఉన్నారు. సంజీవ్ భట్ (ఐపిఎస్ - గుజరాత్): క్రిమినల్ కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. పరమ్ బీర్ సింగ్ (ఐపిఎస్ - మహారాష్ట్ర): ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అయిన ఈయనపై వసూళ్లు, అవినీతి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. రాజీవ్ కుమార్ (ఐపిఎస్ - పశ్చిమ బెంగాల్): శారదా చిట్ఫండ్ దర్యాప్తు వివాదంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. గుర్జోత్ సింగ్ కలేకా (ఐపిఎస్ - పంజాబ్): సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యవహారంలో కోట్లలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై విజిలెన్స్ విచారణను ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారులు కూడా తీవ్ర ఆరోపణలు, సస్పెన్షన్లు ఎదుర్కొన్నారు: యర్రా శ్రీలక్ష్మి -ఐఎఎస్ ఏకంగా జైలుకు వెళ్లాల్సి రావడంతో కెరీర్ పరంగా ఉన్నత పదవులకు దూరమై అనామకంగా పదవీ విరమణ చేశారు.

‘సస్పెన్షన్లలో ఉన్న అధికారులు: విశాల్ గున్ని, క్రాంతిరాణా టాటా తదితరులు సస్పెన్షన్లు ఎదుర్కొనగా, సునీల్ సస్పెన్షన్లోనే రిటైర్ అయినా కేసులు ఇంకా వెంటాడుతున్నాయి.జి. సంపత్ కుమార్ -ఐపిఎస్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్కు సమర్పించిన వివరాల ప్రకారం-2009-2012 మధ్య ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్ అధికారులపై 90 అవినీతి కేసులు నమోదయ్యాయి. 2015-2017 మధ్య 17 మంది ఐఎఎస్, ముగ్గురు ఐపిఎస్ అధికారులపై అభియోగాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2014-2019 మధ్య నలుగురు ఐపిఎస్ అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూషన్కు అనుమతి లభించింది. 2018 నాటికి 29 మంది ఐపిఎస్ అధికారులు శాఖాపరమైన విచారణలు లేదా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇటీవల కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నతాధికారులపై శాఖాపరమైన విచారణలు కొనసాగుతున్నట్లు పార్లమెంట్కు సమాచారం అందింది.

ఇలాంటి ఘటనలు కొన్ని కాలక్రమేణా మారవచ్చు కానీ ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇవి కొందరు వ్యక్తుల వైఫల్యమే తప్ప మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ప్రతిబింబం కాదు.దేశవ్యాప్తంగా వేలాది మంది అధికారులు అత్యంత నిజాయితీ, నిబద్ధతలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, డిజిటల్ పాలన, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో విశేష కృషి చేసి రాష్ట్రపతి పురస్కారాలు, ప్రధాని అవార్డులు అందుకుంటున్న ఆదర్శ అధికారులు నేటికీ ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడుతున్నారు.ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలపై ప్రజల్లో గౌరవం, విశ్వసనీయత నిలవాలంటే తక్షణమే కొన్ని కఠిన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరితగతిన విచారణ చేపట్టి ఉన్నతాధికారులపై వచ్చే ఆరోపణలను వేగంగా తేల్చేందుకు ప్రత్యేక కోర్టులను బలోపేతం చేయాలి. విచారణలో తప్పు రుజువైతే దాటవేత ధోరణి లేకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినప్పుడే అత్యున్నత సివిల్ సర్వీసుల గౌరవం నిలబడుతుంది!

దిమిలి అచ్యుతరావు

 93951 50036