
హైదరాబాద్: రాష్ట్ర కమర్షియల్ టాక్స్ శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గత నెలలో జిఎస్టి, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కలిపి రూ.7,865 కోట్లు వసూలైంది. ఇది రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చరిత్రలోనే అత్యధిక ఆదాయం. గతేడాది జులైతో పోలిస్తే 19 శాతం వృద్ధి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టి వసూళ్లు రూ.5,817 కోట్లు వసూలయ్యాయి. జిఎస్టి వృద్ధి రేటులో హరియాణా తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. దేశవ్యాప్తంగా జులైలో జిఎస్టి వసూళ్లు 10 శాతం వృద్ధి సాధించగా.. తెలంగాణలో మాత్రం 19 శాతం నమోదైంది.










