
యాభై ఏళ్ల జీవితం.. రెండు దశాబ్దాల ప్రజాప్రస్థానం.. తెలంగాణ రాజకీయాల్లో కెటిఆర్ సాధించుకున్న ప్రత్యేక అధ్యాయం.. రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రయాణాన్ని అంచనా వేయడం అంటే కేవలం ఆయన పదవులను, ఎన్నికల విజయాలను లెక్కించడం కాదు. ఒక సమాజం కోసం ఆయన కలలు ఏమిటీ, ఆ కలలను సాకారం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటీ, ప్రజల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు ఎంతవరకు ప్రభావం చూపిందన్నదే నిజమైన కొలమానం. అలాంటి దృష్టితో చూసినప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్న నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్). యాభై సంవత్సరాల జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న కెటిఆర్‌కు ఈ రోజు జన్మదిన వేడుకతోపాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ రాజకీయాలనుంచి అభివృద్ధి రాజకీయాల వైపు సాగిన ప్రయాణంలో కొత్త తరం నాయకత్వం ఎదుగుదలను ప్రోత్సహించిన తీరు ఎంతోమంది కార్యకర్తలు, నాయకుల గుండెల్లో కెటిఆర్ చెరగని ముద్రవేసుకున్నారు.
యాభై సంవత్సరాలు ఒక నాయకుడి జీవితంలో అనుభవం, పరిపక్వతకు కెటిఆర్ రాజకీయ జీవితం నిదర్శంగా నిలస్తోంది. ఇరవై సంవత్సరాల కెటిఆర్ రాజకీయ అనుభవం ఒక పెద్ద బాధ్యత. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, సవాళ్లు, విమర్శలు ఉన్నాయి. కానీ, ప్రతి దశలోనూ ప్రజా జీవితంలో చురుకుగా ఉండటం ఆయన ప్రత్యేకత. కాలమే ప్రతి నాయకుడి పనితీరుకు తుది తీర్పు ఇస్తుంది. ఒక నాయకుడి గొప్పతనం ఆయన ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారన్న దానిలో కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎంత ఉపయోగపడతాయన్న దానిలో ఉంటుందన్నదే నగ్నసత్యం.
ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో
ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో కెటిఆర్ ఒక కార్యకర్తగా, ఉద్యమ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, పరిపాలకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కెటిఆర్ అనేక పాత్రలను పోషించారు. ఒక నాయకుడి ఎదుగుదల వెనుక వ్యక్తిగత నిర్ణయాలు, పరిస్థితులు, ప్రజలతో ఏర్పడిన అనుబంధం కీలక పాత్ర పోషిస్తాయి. ఉన్నత విద్యను అభ్యసించి, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజా జీవితాన్ని ఎంచుకోవడం కెటిఆర్ రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు. సౌకర్యవంతమైన జీవితం కంటే తన ప్రాంతం, తన ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం ఆయన ప్రయాణానికి పునాది వేసింది. రాష్ట్ర సాధన ఉద్యమం కోసం యువ నాయకుడిగా కెటిఆర్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
తెలంగాణను అగ్రగామి
రాష్ట్రంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో
తెలంగాణ ఏర్పడిన తర్వాత కెటిఆర్‌కు అసలు పరీక్ష ప్రారంభమైంది. ఒక కొత్త రాష్ట్రం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో కెటిఆర్‌కు ప్రభుత్వం నుంచి లభించిన మంత్రిత్వ శాఖ బాధ్యతలను కేవలం పరిపాలనా పదవులే కోసమే కాకుండా తెలంగాణ భవిష్యత్‌ను నిర్మించే అవకాశాలుగా మార్చుకున్నారు. ఐటి, పరిశ్రమల రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ఆయన పనిచేశారు. ప్రపంచ పెట్టుబడిదారులతో నేరుగా చర్చలు జరపడం, రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, యువతకు కొత్త అవకాశాలు కల్పించడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన యువతకు తమ రాష్ట్రంలోనే అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. టెక్నాలజీ రంగాన్ని కేవలం ఉద్యోగాల కల్పనకు మాత్రమే కాకుండా ఆవిష్కరణలకు, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా కెటిఆర్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేశారు.
కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం
స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలు, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం కెటిఆర్ చేశారు. హైదరాబాద్‌ను ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో నగర అభివృద్ధి అంటే కేవలం పెద్ద భవనాలు నిర్మించడం కాదని, ప్రజలకు మెరుగైన రవాణా, మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే నిజమైన అభివృద్ధి అని ఆయన ప్రస్తావించారు. కెటిఆర్ నాయకత్వంలో కనిపించిన మరో ముఖ్యమైన అంశం టెక్నాలజీని ప్రజాసేవలకు అనుసంధానం చేయడం. సోషల్ మీడియాను కేవలం రాజకీయ ప్రచార సాధనంగా కాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వేదికగా ఉపయోగించడం కొత్త తరహా రాజకీయ సంభాషణకు కెటిఆర్ నాంది పలికారు. ఒక నాయకుడికి వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యం ద్వారా రాదని కెటిఆర్ కూడా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ విమర్శలనే తాను అస్త్రాలుగా మలుచుకొని ప్రజల్లో మమేకమై వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి తనవంతు కృషి చేశారు.
అయితే విమర్శలను ఎదుర్కొంటూ తన వాదనను గణాంకాలు, అభివృద్ధి అంశాల ఆధారంగా వివరించే ప్రయత్నం ఆయన చేశారు. కెటిఆర్‌కు ప్రత్యేకంగా నిలబెట్టే మరో అంశం ప్రవాస తెలంగాణ. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పెట్టుబడులు, ఆలోచనలు, నైపుణ్యాలతో తమ ప్రాంతానికి తోడ్పడాలని ఆయన ప్రోత్సహించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ సమాజంతో ప్రభుత్వానికి ఒక అనుసంధానాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించారు. ఒక నాయకుడికి వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యం ద్వారా రాదని, ప్రజల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవడం ద్వారా వస్తుందని ఆయన నిరూపించారు.
ఉద్యమ భావోద్వేగాలను అభివృద్ధి, ఆశయాలతో కలిపి ముందుకు తీసుకెళ్లే రాజకీయాల్లో కేవలం నినాదాలు కాకుండా ఆలోచనలు, ప్రణాళికలు, అమలు సామర్థ్యం కూడా అవసరమని కెటిఆర్ ప్రయాణం చూపించింది. యాభై ఏళ్ల జీవిత ప్రయాణం ఒక వ్యక్తి కథ మాత్రమే కాకుండా ఉద్యమ భావోద్వేగాలను అభివృద్ధి, ఆశయాలతో కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన నాయకుడిగా ఆయన తన ముద్రను వేసుకున్నారు. భవిష్యత్ తెలంగాణ రాజకీయాల్లో కెటిఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. అయితే రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఆధునిక తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆయన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచారని మాత్రం చెప్పవచ్చు. యాభై వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేయడం అంటే కేవలం ఒక నాయకుడిని అభినందించడం మాత్రమే కాదు తెలంగాణ అభివృద్ధి కలలతో ముందుకు సాగుతున్న ఒక రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడం కూడా.
- కాసర్ల నాగేందర్‌రెడ్డి
౬౧౪౭౮౩౧౧౫౬౩
(బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు)











