న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అం డర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అఖిల భారత కోటా పరిధిలోని డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరుగుతుంది. ఈ విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 22లోగా కళాశాలల్లో చేరాలి. రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, మూ డో విడత సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. ఖాళీగా మిగిలిన సీట్ల కోసం ప్రత్యేక (స్ట్రే వెకెన్సీ) విడతను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనుండగా,

అందులో ఎంపికైన వారు అక్టోబర్ 10లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 28లోగా చేరాలి. రెండో విడత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు, మూడో విడత సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు జరుగుతుంది. రాష్ట్ర కోటా సీట్లకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ను అక్టోబర్ 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ప్రతి విడత అనంతరం చేరిన విద్యార్థుల ధ్రువీకరణను ఎంసీ సీ, రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు నిర్ణీత గడువులో పూర్తి చేసి తదుపరి సీట్ల కేటాయింపును చేపడతారు. సెప్టెంబర్ 8 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, ఖాళీ సీట్ల భర్తీ కోసం తదుపరి విడతల కౌన్సెలింగ్ కొనసాగుతుందని ఎంసీసీ స్పష్టం చేసింది.కౌన్సెలింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని వైద్య కళాశాలలు, రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు, సంబంధిత సంస్థ లు షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. అవసరమైతే శనివారాలు, ఆదివారాలు,

ప్రభు త్వ సెలవు దినాలను కూడా పని దినాలుగా పరిగణించి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌ను మరింత పారదర్శకంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు ఎంసీసీ పలు కీలక మార్పులు చే సింది. తదుపరి విడతల్లో సీటు అప్‌గ్రేడ్ కోరే విద్యార్థులు కేటాయించిన కళాశాలకు వ్యక్తిగతంగా వెళ్లి హాజరు కా వాల్సిన నిబంధనను తొలగించింది. కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారం వారి ప్రవేశం ఆన్‌లైన్ వ్యవస్థలోనే కొనసాగుతుంది. అలాగే, కేటాయించిన సీటును వదులుకోవాలనుకునే విద్యార్థులు ఇకపై కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎంసీసీ కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో రాజీనామా చేసే సౌకర్యాన్ని కల్పించింది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఆర్‌ఐ రిజర్వేషన్ కింద ప్రవేశం కోరే అభ్యర్థులు కూడా అవసరమైన ధ్రువపత్రాలను కౌన్సెలింగ్ పోర్టల్‌లోనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఎంసీసీ తెలిపింది.