
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు
గ్రీకు పురాణాల్లోని బహు శిరస్సుల జలరాక్షసిగా హైడ్రా వ్యవహరిస్తోంది
63 ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం
రూల్ ఆప్ లాకు ముప్పు అని వ్యాఖ్యానించిన ధర్మాసనం
అర్హత కలిగిన అధికారిని నియమించాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: లోతుకుంట భూముల వివాదానికి సంబంధించిన కేసు విచారణలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్‌ను ఆ కమిషనర్ స్థానం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిను ఆదేశించింది. లోతుకుంట భూముల వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు.
కోర్టు ఉత్తర్వుల అమలులో వరుస ఉల్లంఘనలు చోటుచేసుకోవడం, ఒకే అంశంపై భారీ సంఖ్యలో ధిక్కరణ పిటిషన్లు దాఖలవడాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, రంగనాథ్ కొనసాగితే న్యాయపాలనకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని భూములకు సంబంధించిన వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు, హైడ్రా అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలనే విస్మరిస్తే ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఎలా ఉంచగలరని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం ఒక అంశమైతే, కోర్టు ఎదుట ఇచ్చిన హామీని ధిక్కరించడం మరింత తీవ్రమైన కోర్టు ధిక్కారమని స్పష్టం చేసింది. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యత పేరుతో చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. హైడ్రా వ్యహారశైలిపై కూడా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
గ్రీకు పురాణాల్లోని బహు శిరస్సుల జలరాక్షసిగా హైడ్రాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ప్రజల హక్కులను రక్షించాల్సిన ప్రభుత్వ సంస్థ చట్టానికే అతీతంగా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతోందని పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు తమను తాము స్వతంత్ర అధికార కేంద్రాలుగా భావించి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తే అది న్యాయపాలనకు మత్యు ఘంటిక మోగించినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికార దుర్వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదని, హైడ్రా కూడా చట్టం నిర్దేశించిన హద్దుల్లోనే పనిచేయాలని స్పష్టం చేసింది. సామాన్యులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరిచే బాధ్యత ప్రభుత్వం, అధికారులపైన ఉందని తెలిపింది. హైడ్రా కమిషనర్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లుపెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన నివేదికను ధర్మాసనం ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఇన్ని కేసులు నమోదైనా సంబధిత అధికారిలో మార్పులు కనిపించకపోవడం ఆందోళనకరమని పేర్కొంది.
కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేమిటని ప్రశ్నించిన ధర్మాసనం, న్యాయస్థానాల ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ అధికారులకు తగదని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్తి వివాదంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే అంశంపై మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఆదేశాల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో స్పష్టమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదు.. స్వయంగా కోర్టే అని ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. కోర్టు ధిక్కరణనే పరిపాటిగా మార్చుకున్నారా? కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? అంటూ తీవ్రస్థాయిలో ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
నాలాలు, కాలువలు, నీటి వనరుల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం ఏ చట్టం ప్రకారం సమర్థనీయమని హైకోర్టు నిలదీసింది. కోర్టు తీర్పుల అమలే రాజ్యాంగబద్ధ పాలనకు పునాది అని, వాటిని అమలు చేయకపోవడం ఉద్దేశపూర్వక ధిక్కారంగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. యజమాని అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్తిలో అడుగుపెట్టకూడదన్న ప్రాథమిక సూత్రం కూడా తెలియదా అని, ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యమైతే సంబంధిత వ్యక్తులపై పోలీసు ఫిర్యాదులు ఎందుకు చేశారని, ప్రైవేటు ఆస్తి వివాదాల్లో హైడ్రా పాత్ర ఏమిటని కూడా ధర్మాసనం ప్రశ్నించింది.
హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు
విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేస్తూ హైకోర్టుకు భేషరతుగా క్షమాపణలు చెపుతున్నట్లు, తనపై నమోదు చేసిన ధిక్కరణ కేసును కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు. న్యాయవ్యవస్థ, కోర్టుల పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని, కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. తన చర్యలు కోర్టు ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టు భావించి ఉంటే అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నామన్నారు. హైకోర్టు గౌరవాన్ని, అధికారాన్ని, గౌరవిస్తామని, న్యాయస్థానం పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేశారు. కోర్టు పట్ల ఉన్న అత్యంత గౌరవంతోనే ఈ క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమిలోకి హైడ్రా బృందాలు ప్రవేశించలేదని అఫిడవిట్‌లో వివరించారు. ఈ విషయంలో పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని కూడా తెలిపారు.
రంగనాథ్ దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌ను కూడా హైకోర్టు తొచిపుచ్చింది. నిజమైన క్షమాపణ అనేది శిక్ష తప్పించుకునేందుకు చివరి క్షణంలో చెప్పేది కాదని, తప్పు తెలుసుకున్న వెంటనే హదయపూర్వకంగా వ్యక్తం చేయాల్సిందని పేర్కొంది. గత విచారణలో క్షమాపణ చెబితేనే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేస్తూ, చివరి దశలో సమర్పించిన క్షమాపణను నిజాయితీతో కూడినదిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
ఎం.వై. షరీఫ్, ఎల్.డి. జైక్వాల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అశోక్ పేపర్ కామ్‌గార్ యూనియన్ , కపిల్‌దేవో ప్రసాద్ సాహ్, అనిల్ సర్కార్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను ప్రస్తావిస్తూ, కోర్టు ఎదుట ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం కూడా కోర్టు ధిక్కారమేనని పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయించడం, వాటిని ధిక్కరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం న్యాయస్థానాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేసింది. సెక్రటరీ స్థాయి హోదాలో ఉన్న అధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, కొత్త అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
హైడ్రా కమిషనర్ స్థానంలో తగిన ఐజి లేదా అర్హత కలిగిన అధికారిని నియమించాలని ధర్మాసనం సూచించింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని అదే పదవిలో కొనసాగించడం సరికాదని, రూల్ ఆఫ్ లా పరిరక్షణ కోసం తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు లక్ష్యాలపై కోర్టుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టపరమైన పరిమితులను దాటి వ్యవహరించడం మాత్రం సహించబోమని ధర్మాసనం హెచ్చరించింది. ప్రభుత్వమైనా, ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.
లోతుకుంట 40 ఎకరాల భూమి వివాదం.. శాంత శ్రీరామ్ కేసు నేపథ్యం ఇదే
ప్రస్తుతం హైడ్రా, -శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వివాదానికి కేంద్రబిందువుగా మారిన లోతుకుంట 40 ఎకరాల భూమి కేసు దాదాపు దశాబ్దకాలంగా న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. మల్కాజ్‌గిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు, స్వాధీనం అంశాలపై ప్రభుత్వం, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వాదన ప్రకారం, లోతుకుంట గ్రామ రెవెన్యూ రికార్డుల్లో కేవలం సర్వే నంబర్లు 1, 2 మాత్రమే ఉండగా, ఆ భూమి మొత్తం సుమారు 59 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ భూమి వాస్తవానికి లతీఫున్నీసా బేగమ్‌కు చెందిందని, ఆమె 1955లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా సేథ్ కిషన్‌రామ్ గౌలీకి విక్రయించారని సంస్థ పేర్కొంది.
ఆ విక్రయం అనంతరం కొనుగోలుదారు పేరు రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుగా నమోదు కావడంతో పాటు మ్యుటేషన్ కూడా జరిగిందని సంస్థ కోర్టుకు వివరించింది. భూమిలోని ఐదు ఎకరాల 10 గుంటలను భూ సేకరణ చట్టం- 1894 కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ఆ భూమికి సంబంధించి 1985లో సేథ్ కిషన్‌రామ్ గౌలీకి పరిహారం అవార్డు జారీ చేసినట్లు సంస్థ పేర్కొంది. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కూడా కొంత భూమిని సేకరించగా, ఆ సందర్భంలోనూ పరిహారం కిషన్‌రామ్ గౌలీకే చెల్లించినట్లు రికార్డులు ఉన్నాయని వాదించింది. సేథ్ కిషన్‌రామ్ గౌలీ చట్టబద్ధ వారసులు భూమి అభివృద్ధి కోసం శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌తో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 2008 జూలై 4న 40 ఎకరాల లేఅవుట్‌కు అనుమతి మంజూరు చేసింది.
ప్రభుత్వం వాదన ఏమిటి?
ప్రభుత్వం మాత్రం ఈ భూమి అసలు ప్రైవేట్ ఆస్తి కాదని, జనరల్ ల్యాండ్ రిజిస్టర్ (జిఎల్‌ఆర్) సర్వే నంబర్- 243 పరిధిలోని ప్రభుత్వ భూమి అని వాదిస్తోంది. శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని ఆరోపిస్తూ 2013లో తిరుమలగిరి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అలాగే 1955 నాటి రిజిస్ట్రేషన్ పత్రాలు, తదనంతర రెవెన్యూ నమోదులు చెల్లుబాటు కావని, వాటికి సంబంధించి రెవెన్యూ అధికారుల ఉత్తర్వులు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ అధికారులు తమ హక్కులను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ 2016లో హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి భూమి యాజమాన్యం, స్వాధీనం, ప్రభుత్వ హక్కులు, కంటోన్మెంట్ రికార్డులు, రెవెన్యూ పత్రాలు వంటి అంశాలపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోంది.











