
బ్రెడీ: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ 7.4 ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అంతకు ముందు మార్చి 17, 2017న గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ 9.3 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అలాగే, జూన్ 9, 2017న గ్రోస్ ఐస్లెట్‌లో వెస్టిండీస్‌పై 8.4 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు తీశాడు.
స్పిన్నర్లయిన అజింత మెండీస్ (శ్రీలంక), వానిందు హసరంగ (శ్రీలంక), ఇమ్రాన్ తాహిర్ (సౌతాఫ్రికా), షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్), అకిల ధనంజయ (శ్రీలంక), సందీప్ లామిచానే (నేపాల్) వన్డేల్లో రెండు సార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేశారు. ఇప్పుడు రషీద్ వీరందరిని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.











