
తింసాన్‌పల్లిలో ‘దళితుల అంత్యక్రియలకు’ అవస్థలు
స్మశానానికి వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతున్న దళితులు
ప్రాణాలకు తెగించి వరదనీరులో శవాన్ని తీసుకెళ్తున్న వైనం
పల్లెచెల్మ వాగుపై నూతన బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
మన తెలంగాణ/పెద్దేముల్: స్వాతంత్య్ర భారతదేశంలో దళితుల అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి సుమారుగా 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి దళితులకు కష్టాలు వీడటం లేదు. వాగుపారితే దళితులు అంత్యక్రియలకు నోచుకోలేని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి దుస్థితి వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల పరిధిలోని తింసాన్‌పల్లి గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన జి.బాలమ్మ అనే మహిళ మృతిచెందింది. ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానానికి భయల్దేరారు. అయితే, గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెచెల్మ వాగు ఉధృతంగా పారింది. దీంతో బాలమ్మ అంత్యక్రియలను పూర్తిచేయడానికి సహచర దళిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అంత్యక్రియలు చేయాలంటే పల్లెచెల్మ వాగు దాటి వెళ్ళాల్సి ఉంది. అయితే, ప్రతియేటా వర్షకాలంలో దళిత కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు చేసేందుకు దళితులు అరిగోస పడుతున్నారు.
కొద్దిపాటి వర్షానికి సైతం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపునీటి వలన వాగు ఉధృతంగా పారుతుంది. సుమారుగా 8 నుంచి 10 అడుగుల లోతులో వరదనీతు ఉధృతంగా పారుతుండటంతో అంత్యక్రియలు చేయలేని పరిస్థితి దాపరించింది. అంత్యక్రియలు చేయడానికి కన్నీళ్ళు కార్చుతూ.. వరదనీటిలో నుంచి ప్రాణాలకు తెగించి మృతదేహాన్ని తీసుకెళ్ళాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే, వాగుఎగువన వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భాదలు వర్ణనాతీతమయ్యాయి.
వ్యవసాయ పనుల్లో భాగంగా విత్తనాలు విత్తుకునేందుకు, ఎరువుల మందులను తీసుకెళ్ళడానికి, పండిన ధాన్యాన్ని తీసుకెళ్ళేందుకు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. దళితులు అంత్యక్రియలకు నోచుకోలే.. వ్యవసాయదారులు సక్రమంగా పనులు చేసుకోలేక దుర్భరమైన పరిస్థితిలను ఎదుర్కొంటున్నారు. సమస్యను ఆధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళిన ఫళితం లేకుండా పోయింది. దళితుల అంత్యక్రియల అవస్థలు, రైతుల కష్టాలను చూసైనా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మానవత దృక్పథంతో స్పందించి పల్లెచెల్మ వాగుపై బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.











