
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో వైసిపి నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయనను బుధవారం అరెస్ట్ చేసి, గురువారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ కేసులో తన 18 ఏళ్ల కుమారుడిని కాపాడేందుకు అప్పలరాజు ప్రయత్నించారని పోలీసు లు ఆరోపించారు.
ప్రమాదానికి కారణమైన తన కుమారుడి స్థానంలో సిద్ధార్థ్ అనే మరో కుర్రాడిని నిందితుడిగా చిత్రీకరించేందుకు ఆయన యత్నించారని అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా మృతుడి కుటుంబాన్ని డబ్బుతో ప్రలోభపెట్టాలని చూశారని, కేసుకు సంబంధించిన కీల క సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.











