
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. గతంలోనూ సిఎం దావోస్ పర్యటనకు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగా, ప్రస్తుతం, మరోసారి తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేలా సిఎం ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలిసింది. గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీల ప్రతినిధులతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
పారిశ్రామిక రంగంతో పాటు విద్య, వినూత్న ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధికి సంబంధించి విదేశీ సాంకేతికత విధానాలపై సిఎం ప్రత్యేకంగా స్టడీ చేయనున్నట్టుగా తెలిసింది. ఐటీ, ఫార్మా మ్యానూఫ్యాక్చరింగ్ రంగాలు తెలంగాణ వైపు మొగ్గుచూపేలా ఈ పర్యటన సాగనుందని తెలిసింది. ఈనెల 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వివిధ దేశాల్లో సిఎం పర్యటించనున్నట్టుగా సమాచారం. అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాలకు ముఖ్యమంత్రి వెళ్లనున్నట్టుగా సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి సంస్థలు, ప్రవాస భారతీయులతో సిఎం సమావేశం కానున్నట్టుగా తెలిసింది. ఐటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనున్నట్టుగా సమాచారం. సిఎం విదేశీ టూర్‌కు వెళ్లేముందు రెండురోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.








