
నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లను బిఆర్‌ఎస్ నేతలు ఆదివారం సందర్శించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బిఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, టిజిబికెఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుంకే రవిశంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ తదితరులకు ధర్మారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ధర్మారం అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. నంది మేడారంలోని నంది పంపుహౌస్‌ల వద్ద నీటిని ఎత్తిపోస్తున్న విధానాన్ని నేతలు పరిశీలించారు. అనంతరం బోయిన పల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. సిఎం రేవంత్‌రెడ్డికి నీటిపై అవగాహన లేదని అన్నారు.
ఢిల్లీలో ఎన్డీఎస్ అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నీటిపారుదుల శాఖపై ఏ మాత్రం అవగాహన లేదని, నీటి గురించి, ప్రాజెక్టుల గురించి కనీసం ఎ,బి,సి,డిలు తెలవని.. ఉత్త మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరలో భాగమే ఎల్లంపల్లి ప్రాజెక్టు అని, ఎల్లంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ అన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఎల్లంపల్లి కింది భాగంలో నంది పంప్‌హౌస్‌తోపాటు గాయత్రి పంప్‌హౌస్ టన్నెళ్లు, పంపులు, గ్రావిటీ కాలువలు కాళేశ్వరం ప్రాజెక్టు కాదా అని ప్రశ్నించారు. అవి లేనప్పుడు నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్పించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మాజీ మండలాధ్యక్షులు రాచూరు శ్రీధర్, జిల్లా సహకార సంఘాల ఫోరం మాజీ ఛైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











