
ఛత్రపతిశంభాజీనగర్ (మహారాష్ట్ర): సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ ఆయనకు విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తన నివాసం వద్ద ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అసౌకర్యం అనిపించి ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయని డాక్టర్ చెప్పారు. శనివారం ఆయన నివాసం వద్ద పార్కింగ్ ఏరియాలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఆయన కోసం ప్రజలు వేచి ఉండగా ఆయన వారిని కలుసుకోవడానికి ప్రయత్నించారు.
అక్కడ వాంతులు కాగానే మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోయారు.ఆ తరువాత డాక్టర్ వచ్చి పరీక్షించారని అభిజీత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే వెల్లడించారు. దీప్కేను పరీక్షించిన డాక్టర్ విశాల్ లహనే దీప్కే ఆరోగ్య పరిస్థితి వివరించారు. దీప్కే రక్తపోటు స్వల్పంగా తక్కువ స్థాయిలో 100/60లో ఉందన్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉదయం నుంచి ఆయనకు వికారంగా ఉందన్నారు.
రెండుసార్లు ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయన్నారు. ఆయనకు ఇంట్రావీనస్ ద్రవాలు అందించడమైందని, రోజంతా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు డాక్టర్ చెప్పారు. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని, విశ్రాంతి తీసుకుంటే వెంటనే కోలుకుంటారన్నారు. ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద నిరసనల సమయంలో తాను టైఫాయిడ్ జ్వరంతో బాధపడినట్టు జులై 25న దిప్కే చెప్పారు. గత కొన్ని రోజులుగా తాను అస్వస్తతతో ఉన్నానని, ఇప్పుడు చికిత్స పొందుతున్నానని చెప్పారు.











