కెసిఆర్ హయాంలో సింగరేణికి రూ.54వేల కోట్ల బకాయిలు

ఈ మొత్తాన్ని రేవంత్ సర్కార్ నుంచి వసూలు చేస్తాం

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థకు రూ. 54 వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తామని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. తాజాగా సింగరేణికి వరుసగా మూడో కోల్ బ్లాక్ దక్కిందని ఆయన ఉదహరించారు.

మణుగూరు పికెఒసి-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషంగా ఉందన్నారు. బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమా అని సింగరేణి కార్మికులకు సంబంధించిన రూ. 54 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బకాయిలు వెంటనే ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

తాను సింగరేణికి అన్యాయం చేశానని కెటిఆర్ మాట్లాడడం వింతగా ఉందన్నారు. సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమా? మీ కుటుంబం పుణ్యమా అని ఈ సంస్థ దివాళా తీసే ప్రమాదంలో ఉందని ఆయన విమర్శించారు. తాను బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ సంస్థకు ఉన్న రూ. 54 వేల కోట్ల బకాయిలు ఇచ్చేలా రాష్ట్ర బిజెపి తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రాంలో ప్రధాది నరేంద్ర మోడీ లక్ష్యంగా చేసుకుని, అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తూ పోస్టులు చేశారిని ఆయన విమర్శించారు.

మెటా సంస్థకు నోటీసులు ఇచ్చిన డిసిపి అరవింద్ బాబును రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆయన విమర్శించారు. మెటా కంపెనీపై ఎలా కేసు పెడతారంటూ ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, తెలంగాణ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డిసిపిని బదిలీ చేశారని చెబుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మద్దతుతో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం అక్కడి ప్రతిపక్ష నేత ఏదో అన్నారని ఆయన్ను అరెస్టు చేశారని, మరి వారికి అక్కడో న్యాయం.. ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేస్తే మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.