‘సర్’ దర్ద్ తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. తెలంగాణలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు మరొకసారి పొడిగించినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నట్టుగా అర్హులైన వారందరి ఓట్లకు ఢోకా ఉండదన్న గ్యారెంటీ మాత్రం లభించడం లేదు. నిన్న మొన్నటి వార్తల ప్రకారమే చూసినట్లయితే ఎన్నికల సంఘం నియమించిన బిఎల్‌ఒలు నూటికి నూరుశాతం ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేసాం కానీ అవన్నీ తమ వద్దకు తిరిగిరాని కారణంగా దాదాపు 40 లక్షల ఓట్లు అన్ కలెక్టబుల్ కింద తొలగించే పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల 38 వేలకు పైగా ఓటర్లు ఉంటే ఇప్పటివరకు రెండు కోట్ల 60 లక్షలకు మించి ఓటర్ల పత్రాలు డిజిటలైజేషన్ కానట్టు తెలుస్తోంది. అంటే ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు 20 శాతానికి పైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఎన్యుమరేషన్ పూర్తయి ముసాయిదా జాబితా వెల్లడించిన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఎంత సముదాయించ చూస్తున్నా, సమర్ధించుకో చూస్తున్నా ప్రజలలో, రాజకీయ పార్టీలలో సందేహాలు మాత్రం నివృత్తి కావడం లేదు.

ఇప్పటికే తెలంగాణలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షమైన భారతీయ జనతా పార్టీతో సహా దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు సర్ ప్రక్రియ పట్ల తమ సందేహాలను, అభ్యంతరాలను ఎన్నికల సంఘానికి తెలిపి ఉన్నాయి. అన్నిటికన్నా ముందు అసలు నూరు శాతం ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేశామన్న అధికారుల వాదనను ఎవరూ అంగీకరించడం లేదు. దానికి కారణం పలుచోట్ల బిఎల్‌ఒలు తమ వద్దకు రానే లేదని, తమకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పడం.

కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకోసం ఈ దేశ ప్రజల మౌలిక హక్కు అయిన ఓటును వినియోగించుకునే ప్రక్రియను సులభతరం చేయకుండా ఇంత జటిలం చేస్తున్నది? అందుకే ఎన్నికల సంఘం వెనక రాజకీయ ప్రేరేపితమైన కుట్ర ఉన్నదన్న ఆరోపణలకు బలం వస్తున్నది. దేశంలోని ప్రతి వయోజనుడికి, వయోజనురాలికి ఓటు హక్కు కచ్చితంగా కల్పించాలన్న దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సంకల్పం గురించి, ఆనాడు సుకుమార్ సేన్ నాయకత్వంలో ఓటరు నమోదు కోసం రాజకీయ అధికార యంత్రాంగం పడ్డ కష్టం గురించి ఆలోచిస్తే ఇవాళ రాజకీయ అధికార యంత్రాంగం ఈ ఓటు హక్కు అనే ఒక అతి ముఖ్యమైన ప్రజాహక్కును ఎంత తేలికగా తీసుకుంటున్నదో అర్థమవుతుంది.

తెలంగాణకు సంబంధించినంత వరకు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా దాదాపు రెండు సంవత్సరాలు గడువున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఆలోచించి అర్హులైనవారి ఓట్లు తొలగిపోకుండా చూడటానికి ఏదైనా సులభమైన పద్ధతిని అమలులోకి తెస్తే బాగుంటుంది. నిన్న మొన్న కూడా లోకసభలో రాహుల్ గాంధీ సర్ ప్రక్రియ డొల్లతనం గురించి సాక్షాత్తూ పార్లమెంటు వేదికగా మాట్లాడటం విన్నాం. ఆయన మహారాష్ట్ర ఉదాహరణను మళ్లీ మళ్లీ దేశం దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలనాడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య ఆ తర్వాత కొద్ది మాసాలకు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి హఠాత్తుగా 70 లక్షలకు పెరిగిపోవడాన్ని ఆయన ఉదహరించారు. ఈ 70 లక్షల కొత్త ఓటర్లు లేని 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి మహారాష్ట్రలో ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తే ఈ కొత్త ఓట్లు అదనంగా కలిసిన తర్వాత బిజెపి నాయకత్వంలోని కూటమి గెలవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. పైగా కొత్తగా చేరిన ఈ ఓట్లు మహారాష్ట్ర శాసనసభలో బిజెపి అభ్యర్థులు గెలిచిన స్థానాల్లోనే ఉండటాన్ని ఆయన ఎత్తి చూపుతున్నారు. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు చూపుతున్న ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి వాదన అరణ్య రోదన అయిపోవడం ప్రజాస్వామ్యానికి ఎలా శోభనిస్తుంది? ఆ మధ్యనే సంవత్సర కాలంలో సర్ ప్రక్రియ జరిగిన రాష్ట్రాలలో కోటి ఓట్లు తొలగించినట్టుగా అధికారిక లెక్కలు బయటకు వచ్చాయి. దీన్ని ఏదో ఘనకార్యం సాధించినట్టుగా ప్రకటించుకున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు సర్ ప్రక్రియ పట్ల సందేహాలు కలగడం సహజం.

తెలంగాణ విషయానికొస్తే ఎన్నికల నిర్వహణ కోసం నియుక్తులైన ఉన్నతాధికారులనుండి కింద స్థాయిలో ఉన్న బిఎల్‌ఒల వరకూ ఎవరికీ ఈ విషయంపట్ల సరైన అవగాహన ఉన్నట్టు కనిపించదు. ఈ కసరత్తు సక్రమంగా నిర్వహించి అర్హులైన వారందరి ఓట్లు కాపాడవలసిన బాధ్యత గల యంత్రాంగం పరిస్థితి ఇలా ఉంటే ప్రజలేం చేయగలరు? కొద్ది రోజులు 2002 నాటి సర్ వివరాలు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాల్లో పూరించాలన్న నిబంధన కచ్చితంగా ఉన్నట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు ‘అది తప్పనిసరి ఏమీ కాదు, మీ దగ్గర ఆ వివరాలు లేకపోతే వదిలేయండి’ అని చెప్తున్నారు. కొంతకాలం ఈ సర్ ప్రక్రియతో సంక్షేమ పథకాలన్నీ ముడిపడి ఉంటాయన్న ప్రచారం కూడా చేశారు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక సందర్భంలో ఓటర్లకు అవగాహన కల్పించే పనిలో భాగంగా ఓటు విషయంలో జాగ్రత్త పడకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్న సందేహాన్ని, ఆందోళనను వ్యక్తం చేసిన పరిస్థితి.

తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారి సర్ ప్రక్రియకు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటువంటి సందేహాలు ఇంకా కొన్ని జనంలో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడం మాత్రమే కాకుండా అసలు మొత్తం ప్రక్రియ పట్ల ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్రమైన అనుమానాలకు ఆస్కారం లేకుండా సులభంగా పరిష్కారం అయ్యే పద్ధతి ఏదైనా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తే మంచిది.

1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఎన్నికలకు పోకుండా 1951 దాకా ఆగడానికి కారణం దేశంలోని ప్రతి అర్హుడైన వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలన్న తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సంకల్పం. ఆ కార్యక్రమం పూర్తి చెయ్యడానికి ఆనాటి యంత్రాంగం పడ్డ ప్రయాసను ఇప్పటివారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి ఓటర్లను నమోదు చేయడానికి అవసరమైన కాగితాలు కానీ, రాయడానికి కలాలూ, వాటిలోకి అవసరమైనంత సిరా కానీ అందుబాటులో లేని స్థితి. అనేక ప్రాంతాలకు యంత్రాంగం చేరుకునేందుకు రవాణా సౌకర్యాలు కూడా లేని దుస్థితి. పడవల్లో నదులు దాటాల్సి వచ్చింది. గుర్రాలు, గాడిదలను ఎక్కి కొండలు గుట్టలు దాటి వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడికి చేరుకొని ఈ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆనాడు అంత అననుకూల పరిస్థితుల్లో విజయవంతం చేసిన ఆ యంత్రాంగం స్ఫూర్తిని ఇవాళ్టి ప్రభుత్వాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత, టెక్నాలజీ ఇంత పురోగమించిన తర్వాత క్షణాల మీద ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే పరిస్థితి, చేరుకోగల సావకాశం ఉన్న తరుణంలో తెలంగాణ వంటి ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న మూడు నాలుగు కోట్లమంది గురించిన సమాచారాన్ని తేలికగా తెలుసుకునే ప్రక్రియ ఏదైనా కనుగొనే ఆలోచన ఎన్నికల సంఘం ఎందుకు చేయడం లేదు?

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ప్రక్రియ పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సరేసరి. లక్షలాదిమంది పేర్లు ఓటర్ల జాబితానుండి తొలగిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కూడా ఇంచుమించుగా ఇటువంటి సందేహాలనే వ్యక్తం చేస్తున్నది. దాదాపు 40 లక్షల మంది ఓట్లు తొలగిపోయే అవకాశం తెలంగాణలో ఉన్నదన్నది భారత రాష్ట్ర సమితి ఆందోళన. ఇక దాదాపు అన్నిపక్షాలనుంచి వస్తున్న ఫిర్యాదుల్లో అధికారుల లోపాలు, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు సరిగా పనిచేయడం లేదని, కనీస అవగాహన కూడా లేని కారణంగా వారు ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నాయి.

ఈ ప్రక్రియ గడువు మరింత పెంచాలని కూడా దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాల డిమాండ్‌గా వినిపిస్తున్నది. ముందే చెప్పుకున్నట్టుగా తెలంగాణలో గడువు ప్రకారమే అయితే శాసనసభ ఎన్నికలు 2028లో, లోకసభ ఎన్నికలు 2029లో జరగాలి. రెండు, రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేసి అర్హత గల ఏ వయోజనుడూ ఓటు హక్కు కోల్పోకుండా చూసేందుకు నెహ్రూ స్ఫూర్తిని నిలబెడుతూ ఒక సులభమైన పద్ధతిని రూపొందించి అమలు చేస్తే మంచిది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కనీసం తెలంగాణ రాష్ట్రంలో స్వప్రయోజనాన్ని ఆశించి అర్హులకు ఓట్లు లేకుండా చేశారన్న అపవాదునుండి బయటపడతాయి.