న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ హై కోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఇతర ప్రాంతాలకు శుక్రవారం బెదిరింపు మొయిల్ వచ్చింది. ఖలిస్థాన్ పేరిటి ఇది వచ్చినట్లు పోలీైసు వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ హైకోర్టులో శనివారం మధ్యాహ్నం 2.11 గంటలకు బాంబు పేలుతుందని, ఆ తర్వాత దిగువ కోర్టుల్లో పేలుళ్లు జరుగుతాయని ఆ మొయిల్‌లో దుండగులు హెచ్చరించారు. ఖలిస్థానీ వేర్పాటువాద సభ్యులు ఇప్పటికే రాజధాని నగరానికి చేరుకున్నారని పేర్కొన్నారు. జామ్‌నగర్ హౌస్, ఝండేవాలన్ బిల్డింగ్, సాకేత్ ఆఫీస్, డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ ఆఫీస్, విమానాశ్రయం టర్మినల్-2, ఢిల్లీ మెట్రో, అంబాలకు వెళ్లే రైళ్లు.. ఇలా పలు ప్రదేశాలను దుండగులు మొయిల్‌లో ప్రస్తావించారు.

స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఢిల్లీలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి. ఈ బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. అందులో చెప్పిన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతానికి అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదని అధికారులు తెలిపారు.