మేధో వైకల్యాలున్న (ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్) వ్యక్తుల సాధికారత కోసం మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘స్వయంకృషి’ ఈ ఏడాది తన 35 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని జరుపుకుంటోంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాల శిక్షణ, స్వతంత్ర జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మేధో వైకల్యాలున్న వారికి అండగా నిలుస్తూ దేశంలోనే ఆదర్శ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ రంగంలో ప్రముఖ నిపుణురాలిగా పేరొందిన మంజుల కల్యాణ్ 1991లో ఈ సంస్థను స్థాపించారు. ప్రత్యేక అవసరాలున్న ప్రతి ఒక్కరికీ సమాన విద్యా అవకాశాలు, వ్యక్తిగత అభివృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ‘స్వయంకృషి’ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మేధో వైకల్యాలున్న వారి సంక్షేమంతోపాటు మహిళల సాధికారతకు కూడా మంజుల కల్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారు. సంస్థలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అనేక మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

మేధో వైకల్యాలున్న వయోజనుల పునరావాసం, సమాజంలో వారిని భాగస్వాములుగా తీర్చిదిద్దడం వంటి అంశాల్లో ‘స్వయంకృషి’ దేశం లో ముందంజలో నిలిచింది. ముఖ్యంగా ‘గ్రూప్ హోమ్స్’ భావనను భారత్‌లో ప్రోత్సహించడంలో, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో సమ్మిళిత సమాజం (ఇన్‌క్లూజన్) కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. 18 ఏళ్లు దాటిన మేధో వైకల్యాలున్న బాలికల కోసం పాఠశాల, వసతి గృహాన్ని నిర్వహిస్తున్న ఈ సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధంతో ప్రత్యేక విద్యలో బిఎడ్ కోర్సును కూడా అందిస్తోంది. త్వరలోనే మాస్టర్స్ కోర్సును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇక్కడ నుంచి బిఎడ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. మేధో వైకల్యాలున్న వారి సంక్షేమం కోసం చేసిన విశేష సేవలకు గాను సంస్థ వ్యవస్థాపకురాలు మంజుల కల్యాణ్ అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ముఖ్యంగా 1991లోనే ‘గ్రూప్ హోమ్స్’ భావనను ప్రవేశపెట్టి దేశంలో వినూత్న పునరావాస విధానానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 2007లో భారత ప్రభుత్వం ‘ఇన్‌క్లూజన్ యాక్ట్’ ద్వారా ఈ భావనకు చట్టబద్ధ గుర్తింపు ఇచ్చింది. ఈ వినూత్న సేవలకు గుర్తింపుగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘దివ్యాంగుల సంక్షేమానికి జాతీయ పురస్కారం’ అందుకున్నారు. అలాగే 2018లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘ఉత్తమ వ్యక్తిగత నిపుణురాలు’ జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రత్యేక విద్యలో బిఎడ్ కోర్సు కోసం రెండు పుస్తకాలను రచించిన మంజుల కల్యాణ్, యూనిసెఫ్ ఆర్థిక సహకారంతో రూపొందించిన అభ్యాస వైకల్యాలపై నాలుగు శిక్షణ మాన్యువళ్లకు సహ రచయితగా కూడా వ్యవహరించారు.

2016లో ‘స్వయంకృషి’ తన కార్యకలాపాలను జవహర్‌నగర్‌లోని చెన్నాపూర్‌లో ఉన్న ఐదు ఎకరాల విస్తీర్ణంలోని నూతన ప్రాంగణానికి మార్చింది. ఈ క్యాంపస్‌లో మేధో వైకల్యాలున్న పిల్లల కోసం తరగతి గదులు, సుమారు 70 మంది బాలికలకు ప్రత్యేక వసతి గృహం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ విభాగాలు, రోజూ సుమారు 150 మందికి ఆహారం అందించే విశాలమైన వంటశాల, భోజనశాల, ప్రత్యేక విద్యలో బిఎడ్ కళాశాలతోపాటు త్వరలో ప్రారంభం కానున్న ఎంఎడ్ కోర్సుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ సంస్థలో సుమారు 70 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో ఎక్కువ మంది సమీప గ్రామాలకు చెందిన మహిళలే. వివిధ విభాగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. 35 ఏళ్ల సేవా ప్రయాణంలో ‘స్వయంకృషి’ వివిధ స్థాయిల మేధో వైకల్యాలున్న 250 మందికి పైగా జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. వసతి గృహంలో ఉంటున్న బాలికలకు 24 గంటలపాటు సంరక్షణ, సహాయ సేవలను అందిస్తోంది.

దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త, ఎన్‌టిపిసి, ఎల్‌ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్), పలువురు దాతలు, స్థానిక ప్రజల సహకారంతో ఈ భవనాలు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నిర్మించారు. ‘స్వయంకృషి’లో శిక్షణ పొందిన మేధో వైకల్యాలున్న విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక పిల్లల జాతీయ ఒలింపిక్స్‌లో ఈ సంస్థ విద్యార్థులు నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ సంస్థ విద్యార్థులు దేశానికి కీర్తి తెచ్చారు. గ్రీస్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ హ్యాండ్‌బాల్ పోటీల్లో అమ్మి, గాయత్రి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఇందులో అమ్మి కాంస్య పతకం, గాయత్రి రజత పతకం సాధించారు. అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో బోచ్చే క్రీడలో భారత తరఫున పోటీ పడిన అక్షర కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఉపాధి కల్పనలోనూ ‘స్వయంకృషి’ విశేష ఫలితాలు సాధిస్తోంది. సంస్థలో శిక్షణ పొందిన మేధో వైకల్యాలున్న పది మంది యువతులు రత్నదీప్ సూపర్‌మార్కెట్ శ్రేణిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వస్తువుల తూకం వేయడం, సీలింగ్, బార్‌కోడింగ్, పరిశుభ్రత నిర్వహణ వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ సహోద్యోగుల ప్రశంసలు అందుకుంటున్నారు.

సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు తయారు చేసిన వస్త్ర సంచులకు విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఒక్క ఏడాదిలోనే 450 క్లాత్ బ్యాగ్‌లను అమెరికాకు ఎగుమతి చేశారు. విదేశీ సంస్థలతోపాటు కార్పొరేట్ సంస్థల నుంచి కూడా నిరంతరం ఆర్డర్లు అందుతున్నాయి. అలాగే ‘స్వయంకృషి’ తయారు చేసే ఉత్పత్తులు గ్రాండ్ కాకతీయ, నోవటెల్, మారియట్ వంటి ప్రముఖ హోటళ్లకు కూడా సరఫరా అవుతున్నాయి. మేధో వైకల్యాలున్న వారిని సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ట్రస్ట్, ‘స్వయంకృషి’ని స్థానిక స్థాయి కమిటీ (లోకల్ లెవల్ కమిటీఎల్‌ఎల్‌సీ)గా నియమించింది. కుటుంబ సభ్యులు, దాతలు, ఇతర భాగస్వాముల పట్ల పూర్తి పారదర్శకతను పాటిస్తూ సంస్థ ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, తాజా సమాచారాన్ని క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది.