తెలంగాణలో అమలు చేస్తున్న షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఉచిత పథకాల అమలుపై దాఖలైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ వరకు ఈ రెండు పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
ఉచిత పథకాల అమలుపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం (ఆగస్టు 12) జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. చట్టసభల్లో తీర్మానం లేకుండా అమలు చేస్తున్న పథకాలు చెల్లవని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాల కింద తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.









