మనిషి చరిత్రను గమనిస్తే ఒక విరోధాభాసం స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ కోసం పుట్టిన మనిషే, తన చేతుల తో తానే బంధనాలను నిర్మించుకున్నాడు. ప్రకృతిలోని ఇతర జీవుల మాదిరిగా ప్రేమతో, సహజత్వంతో జీవించాల్సిన మ నిషి, నాగరికత పెరిగిన కొద్దీ అధికారం, ఆధిపత్యం, మతం, జాతి, సంపద, విజ్ఞానం పేర్లతో తన చుట్టూ కనిపించని సంకెళ్లను వేసుకున్నాడు. ప్రపంచంలోని యుద్ధాలు, రాజ్యాలు, వలస పాలనలు, మత ఘర్షణలు అన్నీ చివరికి ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించాలనే తపన నుంచే పుట్టాయి. ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి సహజ మానవ విలువలు క్రమంగా భయం, ద్వేషం, అసూయ, అహంకారాల కింద నలిగిపోయాయి. నాగరికత మనిషికి సౌకర్యాలు ఇచ్చినా, అంతరంగ శాంతిని మాత్రం దూరం చేసింది.

ఈ సంక్షోభాన్ని ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్ స్టా య్, దాదాపు 116 సంవత్సరాల క్రితమే తన హిందువులకో ఉత్తరంలో విశ్లేషించాడు. 1908లో అమెరికాలోని భారత స్వాతంత్య్ర సమరయోధుడు తారకనాథ్ దాస్ కు రాసిన ఈ లేఖలో టాల్‌స్టాయ్ కేవలం బ్రిటిష్ వలస పాలనను మాత్రమే విమర్శించలేదు. బానిసత్వం అనే భావన మనిషి అంతర్మనస్సులో ఎలా పుడుతుందో వివరిస్తాడు. ఈ లేఖను మళ్ళీ ఇ న్నాళ్ళకు చింతకుంట్ల సంపత్‌రెడ్డి పుస్తక రూపంలో ప్రచురించారు. టాల్‌స్టాయ్ దృష్టిలో బానిసత్వం బయట నుంచి రుద్దబడిన శక్తి కాదు. అది మనిషి లోపలి భయాలు, అజ్ఞానం, అధికారం పట్ల భక్తి, మతపరమైన మూఢనమ్మకాలు, జాతి-వర్ణ ఆధారిత అసమానతల ద్వారా నిర్మించబడుతుంది. ఇతరులు నిన్ను బానిస చేయలేరు. నీవు అంగీకరించినప్పుడే అది సాధ్యం అనే భావనను ఆయన అత్యంత స్పష్టంగా ప్రతిపాదించాడు.ఇది భారతీయ తాత్విక సంప్రదాయాలతో కూడా ముడిపడి ఉంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ’ (18.66) అనే వాక్యం కేవలం భక్తి సందేశం మాత్రమే కాదు. అది వ్యక్తి తనపై రుద్దబడిన కృత్రిమ గుర్తింపులను - వర్ణం, మతం, కులం, అధికార భయాలు, సామాజిక సంకెళ్లు - వీడి, సత్యాన్ని గ్రహించమనే పిలుపు. మామేకం అంటే వ్యక్తిలోని

అంతరాత్మ, పరమసత్యం,

ప్రేమ. ఆ సత్యాన్ని గ్రహించిన

ప్పు డు మాత్రమే విముక్తి.

అలాగే గీతలోని

‘నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః’(2.16) అనే శ్లోకం టాల్‌స్టాయ్ తత్వానికి

దగ్గరగా ఉంటుంది. అసత్యాని కి శాశ్వతత్వం లేదని, సత్యం ఎప్పటికీ నశించదని ఇది చెబుతుంది. సామ్రాజ్యాలు, యుద్ధాలు, జాతీయ గర్వాలు, మత ద్వేషా లు అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. కానీ ప్రేమ, కరుణ, మానవత్వం, సత్యం ఇవే శాశ్వత విలువలు. టాల్‌స్టాయ్ ప్రత్యేకత ఏమిటంటే, ఆయన మతాల బాహ్యరూపాలను కాదు, వాటి అంతరార్థాన్ని గ్రహించాడు. వేదాలు, ఉపనిషత్తులు, గీత, బై బిల్, ఖురాన్, బౌద్ధం, జైనం అన్నింటిలోనూ ప్రేమనే మూల సూత్రంగా చూశాడు. అందు కే ఆయన ఇలా భావించాడు. అన్ని మతాలు ప్రేమను బోధించాయి. కానీ మత సంస్థలు మాత్రం అధికారాన్ని కాపాడటానికి హింసను ఉపయోగించాయి.

ఋగ్వేదంలోని -‘సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్’ అనే వాక్యం సామూహిక చైతన్యాన్ని, పరస్పర అవగాహనను ప్రతిపాదిస్తుంది. అంటే మతాల మూల సారం స్వేచ్ఛ, ప్రేమ, సమానత్వం. కానీ చరిత్రలో మతాలు రాజకీయ అధికారాలతో కలిసినప్పుడు అవి నియంత్రణ సాధనాలుగా మా రాయి. టాల్‌స్టాయ్ విమర్శ కూడా ఇక్కడే కేంద్రీకృతమవుతుం ది. ఆయన దృష్టిలో మతం ఒక జీవన నైతికత. కానీ మత సంస్థలు అధికారం కోసం పనిచేసే యంత్రాంగాలుగా మారాయి.

ఇది నేటి ప్రపంచంలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనిషికి అపారమైన సౌకర్యాలు ఇచ్చింది. కానీ అదే విజ్ఞానం యుద్ధ పరిశ్రమకు, అణు బాంబులకు, డిజిటల్ నిఘాకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నియంత్రణ వ్యవస్థలకు పునాది అయింది. సాంకేతికత మనిషిని విముక్తి చేయాల్సింది పోయి, అతని ఆలోచనలనే మార్కెట్‌కు బానిస చేసింది. టాల్‌స్టాయ్ 1908లోనే శాస్త్రీయ విజ్ఞానం కూడా అధికారానికి సేవ చేస్తే అది మరో మతమూఢత్వమే అని హెచ్చరించా డు. ఇది నేటి పరిస్థితుల్లో మరింత నిజమైంది. సోషల్ మీడి యా యుగంలో వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచిస్తున్నానని భావిస్తున్నప్పటికీ, అతని అభిప్రాయాలను అల్గోరిథములు, రాజకీయ ప్రచారాలు, మార్కెట్ శక్తులు నిర్మిస్తున్నాయి. ప్రపంచ యుద్ధాల నుండి ఉక్రెయిన్- రష్యా యుద్ధం వరకు, ఇజ్రాయిల్ -పాలస్తీనా ఘర్షణల నుండి మతపరమైన హింసల వరకు -చివరకు అన్ని యుద్ధాలు చర్చలతోనే ముగుస్తున్నాయి. అ యినప్పటికీ మానవజాతి ఇంకా శక్తి ద్వారా శాంతి సాధ్యమని నమ్ముతోంది. ఇదే నాగరికత యొక్క విషాద విరోధాభాసం.

మహాత్మా గాంధీపై టాల్‌స్టాయ్ ప్రభావం ఇక్కడ ఎంతో ప్రా ధాన్యం సంతరించుకుంటుంది. గాంధీ అహింసను కేవలం రాజకీయ ఆయుధంగా కాకుండా, మానవ విముక్తి సిద్ధాంతంగా అభివృద్ధి చేశాడు. సత్యాగ్రహం అంటే సత్యంపై ఆత్మ యొక్క పట్టుదల. ఇది టాల్‌స్ట్టాయ్ ప్రేమ ధర్మం భావనతో ముడిపడి ఉంది. మనిషి అసలు స్వభావం ప్రేమ, స్వేచ్ఛ, సహజీవనం. కానీ అతని అహంకారం, భయం, అసూయ, ఆధిపత్య తపన అతడిని హింసాత్మక జీవిగా మారుస్తాయి. నాగరికత మనిషికి సాంకేతిక శక్తిని ఇచ్చింది. కానీ నైతిక స్ప ష్టతను ఇవ్వలేదు.

అందుకే ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవ సంబంధాలు సంక్షోభంలో పడుతున్నాయి. టాల్‌స్టాయ్ సందేశం యొక్క ప్రాసంగికత ఇక్కడే ఉంది. ఆయన చెప్పినది ఏకైక మతం, జాతి, దేశానికి సంబంధించినది కాదు. అది మానవజాతి భవిష్యత్తుకు సంబంధించిన హె చ్చరిక. ప్రేమ లేకుండా నాగరికత నిలవదు. స్వేచ్ఛ లేకుండా మానవత్వం వికసించదు. సత్యం లేకుండా శాంతి సాధ్యం కాదు. అందుకే హిందువులకో ఉత్తరం కేవలం ఒక చారిత్రక లేఖ కాదు. అది మనిషి తనను తాను తిరిగి కనుగొనమనే పిలుపు. మనిషి ఇతరులపై ఆధిపత్యం కోసం కాకుండా, తనలోని ప్రేమను విస్తరించడానికి జీవించినప్పుడే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుంది. లేకపోతే సాంకేతికంగా ఎంత ఎదిగినా, మనిషి తనే నిర్మించుకున్న సంకెళ్లలో బంధించబడి ఉండిపోతాడు.

- సిహెచ్.వి. ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్