ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఒకే ధ్రువీకరణ పత్రంలో పొందుపరచే ఈ విధానం ద్వారా పౌరులు వివిధ ప్రభుత్వ సేవలను పొందే సమయంలో అనేక పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గనుంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం పౌరులు సమీపంలోని మీసేవ కేంద్రం, మీసేవ ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ఏ సభ్యుడైనా ఈ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు.

ప్రభుత్వం రూపొందిస్తున్న తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ రేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) డేటాబేస్ ఆధారంగా రూపొందించబడుతుంది. ఇందులో కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వారి సంబంధం, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ వివరాలు, నివాస చిరునామా వంటి సమాచారం నమోదు చేయబడుతుంది. రేషన్ కార్డు నంబరునే ఫ్యామిలీ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు.

దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత తహసీల్దార్ వివరాలను పరిశీలించి డిజిటల్ సంతకంతో ఆమోదిస్తారు. సాధారణంగా రెండు పని దినాల్లో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ సర్టిఫికెట్ ఆస్తి హక్కు, వారసత్వ హక్కు లేదా ప్రభుత్వ పథకాల అర్హతకు చట్టబద్ధమైన ఆధారంగా పరిగణించబడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేవలం కుటుంబ వివరాలను ధృవీకరించే అధికారిక పత్రంగా మాత్రమే ఉపయోగించబడుతుంది.

ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరుల సమయం ఆదా కావడంతో పాటు కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.