
జోగులాంబ వద్ద ఆర్వోబీకి రూ.45 కోట్లు
తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
గద్వాల: తెలంగాణలో రైల్వే మార్గాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందనికేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కొత్త రైల్వే మార్గాలతో రైలు ప్రయాణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోగులాంబ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధికి గుర్తించగా, ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్’ రక్షణ వ్యవస్థను తెలంగాణలో వినియోగిస్తున్నామని, భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లు రానుండగా, అందులో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు సుమారు రూ.5 లక్షల కోట్ల నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.45 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, జడ్చర్ల రైల్వే స్టేషన్లను పరిశీలించనున్నట్లు తెలిపారు.











