
భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా దేశంగా 2025 నాటికి సుమా రు 146 కోట్ల జనాభాతో చైనాను అధిగమించిన ఆనంద సమయంలోనే ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది.దేశంలోని మొత్తం సంతానోత్పత్తి రేటు 2024లో 1.9కు పడిపోయింది. జనాభా స్థిరంగా కొనసాగాలంటే అవసరమైన స్థాయి 2.1 కాగా, ప్రస్తుతం అది దాని కంటే స్పష్టంగా తక్కువగా ఉంది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు; దేశభవిష్యత్తు జనాభా నిర్మాణాన్ని పూర్తిగా మార్చగల పరిణామం. ఒకప్పుడు ‘జనాభా విస్ఫోటనం’ గురించి ఆందోళన చెందిన భారత్, ఇప్పుడు ‘జనాభా తగ్గుదల’ అనే కొత్త సవాలును ఎదుర్కొంటోంది. ఈ మార్పు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటిపైనా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనుంది. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అత్యంత తక్కువగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో అది ఇంకా ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో ఈ రేటు 1.2 కాగా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో 1.3, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో సుమారు 1.4గా ఉంది. సిక్కిం 1.05తో దేశంలోనే అత్యల్ప స్థాయిలో ఉండగా, గోవా, లడఖ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈరాష్ట్రాల్లో పిల్లల సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది.
మరోవైపు బీహార్‌లో ఈ రేటు 2.9, ఉత్తరప్రదేశ్‌లో 2.6, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2.4గా ఉంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన స్థాయి కంటే ఎక్కువగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు ఇప్పటికీ సుమారు 2.1 వద్ద ఉండగా, పట్టణాల్లో అది 1.5కు పడిపోయింది. ఈ పరిస్థితి దేశాన్ని రెండు భిన్న దిశల్లో నడిపిస్తోంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా, ఉత్తర రాష్ట్రాల్లో యువ జనాభా అధికంగా ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో వలసలు, రాజకీయ ప్రాతినిధ్యం, కేంద్ర నిధుల పంపిణీ వంటి అంశాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఈ మార్పు ఒక్కసారిగా సంభవించలేదు. దశాబ్దాలుగా జరిగిన సామాజిక, ఆర్థిక మార్పుల ఫలితమే ఇది. మహిళల విద్యా స్థాయి పెరగడం, కుటుంబ నియంత్రణ సాధనాలు సులభంగా అందుబాటులోకి రావడం, శిశుమరణాల రేటు తగ్గడం, పట్టణీకరణ వేగవంతం కావడం, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం వంటి సానుకూల పరిణామాలు దీనికి ప్రధాన కారణాలు. అలాగే పిల్లల విద్య, వైద్యం, జీవన వ్యయం పెరగడం, ఆలస్య వివాహాలు, ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాల మధ్య సమతుల్యం కష్టంగా మారడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో జీవనశైలి మార్పులు, అధిక మానసిక ఒత్తిడి, పురుషుల్లో సంతాన సమస్యలు కూడా దీనికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు దశాబ్దాలుగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు కూడా ఈ మార్పును వేగవంతం చేశాయి. ఇది ఒకవైపు ప్రజారోగ్య విజయమే అయినప్పటికీ, మరోవైపు దీర్ఘకాలిక సవాళ్లకు కూడా దారితీస్తోంది. జనాభా తగ్గుదల ప్రభావాలు రాబోయే కాలంలో మరింత స్పష్టంగా కనిపించనున్నాయి. దేశం సంపన్నంగా మారకముందే వృద్ధుల జనాభా పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. కేరళలో 2036 నాటికి వృద్ధుల సంఖ్య పిల్లల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. దీనివల్ల వైద్య సేవలు, పింఛన్లు, సామాజిక భద్రత పథకాలపై భారీ ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు యువ కార్మికుల సంఖ్య తగ్గితే ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం యువతకు ఉపాధి కల్పించడం ఒక పెద్ద సవాలుగా ఉండగా, భవిష్యత్తులో నైపుణ్యం లేని యువతకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ఉత్తర రాష్ట్రాల నుంచి దక్షిణ రాష్ట్రాలకు వలసలు పెరగడం వల్ల సామాజిక, భాషాపరమైన ఉద్రిక్తతలు కూడా తలెత్తవచ్చు. అలాగే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి మందగించడం, పన్ను ఆదాయం తగ్గడం, వినియోగం క్షీణించడం వంటి ఆర్థిక ప్రభావాలు కూడా కనిపించే అవకాశముంది. భారత్ ప్రస్తుతం ఒక చారిత్రక మలుపు వద్ద నిలిచింది. దశాబ్దాల కృషితో లభించిన యువ జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే, భవిష్యత్తులో జపాన్, దక్షిణకొరియా వంటి దేశాలు ఎదుర్కొంటున్న వృద్ధా ప్య జనాభా సంక్షోభాన్ని మనం కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రభుత్వం, ఆర్థిక నిపుణులు, సమాజం కలిసి దీర్ఘకాలిక దృష్టితో విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో సమగ్ర విధానాలను రూపొందించాలి. దేశ యువశక్తిని నైపుణ్యం, సాంకేతికత, ఉత్పాదకత వైపు మళ్లించాలి. భారత భవిష్యత్తును నిర్ణయించే ఈ చారిత్రక దశలో తీసుకునే నిర్ణయాలే రానున్న తరాల దిశను నిర్దేశిస్తాయి.
- కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, 90101 28884








