మన తెలంగాణ/-శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మం డల పరిధిలోని బహుదూర్‌గూడ గ్రామంలో శనివారం నాడు హైటెన్షన్ కొనసాగింది. గ్రామంలోకి హైడ్రా రాకతో ఉద్రిక్తత మొదలైంది. భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేపట్టారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య ప్రికాస్ట్ గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. హైడ్రా బలగాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను, స్థానిక రైతులను పోలీసులు అరెస్టు చేశారు. చేవెళ్ల, మహేశ్వరం డీసీపీలు దగ్గరుండి మరీ పరిస్థితిని సమీక్షించారు. బహదూర్‌గూడలోని సర్వేనెంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు మొత్తం 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి, రైతులకు మధ్య వివాదం ఏండ్ల తరబడి కొనసాగుతున్నది.ఈ నేపథ్యంలో 650 ఎకరాలను అధీనంలోకి తీసుకునేందుకు 10-.07.-2026 నాడు రాజేంద్రనగర్ ఆర్డిఓ హైడ్రా అధికారులకు లేఖ రాశారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు హైడ్రా, రెవెన్యూ అధికారులు బహదూర్‌గూడకు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వబోమని కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టారు. వారికి పలు పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. కాగా, శనివారం ఉదయం నుంచి భారీ యంత్రాలతో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. రైతులు అడ్డుకునే యత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సరైన పరిహారం ప్రకటించిన తర్వాతనే హైడ్రా అధికారులు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టారు. దీంతో బహదూర్‌గూడ రణరంగంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు అనంతరం డీసీపీ యోగేష్ గౌతమ్‌తో సహా పలువురు సీఐల కండ్లల్లో కారం చల్లి తీవ్ర ఆందోళన చేపట్టారు.

బుల్లెట్ ట్రైన్ హబ్ ఆర్టీసీ టర్మినల్ ఏర్పాటు కోసం భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తూ నిరసన చేపడుతున్నారు. వీరికి పలువురు పార్టీల నేతలు కూడా మద్దతిస్తున్నారు. అయితే రైతులతో పాటు, నేతలను పోలీసులు అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. దీంతో బహదూర్‌గూడ రణరంగంగా మారింది. పోలీసులు గ్రామంలోకి ఎవరినీ రానియకుండా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే రైతులకు మద్దతుగా వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ రాజేంద్రనగర్ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నందిగామ పీఎస్ కు తరలించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డిని మైలార్‌దేవుపల్లిలోని ఆయన ఇంటి వద్ద నే పోలీసులు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్‌ను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.