ఇటీవల జపాన్ ఓపెన్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత షట్లర్ పివి సింధుకు చైనా ఓపెన్‌లో పరాజయం తప్పలేదు. ప్రిక్వార్టర్స్‌లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్ చేతిలో 16-21, 22-20, 21-18 తేడాతో సింధు ఓటమిపాలైంది. జపాన్ ఓపెన్‌లో సెమీస్‌లో యుఫీయ్‌ని ఓడించి సింధు ఫైనల్స్‌కి చేరుకుంది. కానీ, చైనా ఓపెన్‌లో అదే ప్రత్యర్థి చేతిలో చిత్తైంది.

దాదాపు గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌లో 21-16 తేడాతో సింధునే విజయం సాధించింది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు అదే జోరును కొనసాగించింది. కానీ, ఆఖర్లో పుంజుకున్న యుఫీయ్‌ 22-20 తేడాతో గెలిచి స్కోర్‌ను (1-1) సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ తీవ్ర పోటీ తప్పలేదు. పాయింట్ల కోసం ఇరువురూ తీవ్రంగా శ్రమించారు. చివరికి 21-18 తేడాతో సింధుపై గెలిచిన యుఫీయ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.