బిజెపి, ఎన్‌సిపి నుంచి కొత్త నేతలకు అవకాశం

ఆర్‌పిఐ (ఎ)లో అభిజిత్ దీప్కే చేరాలని కోరిన రాందాస్ అథవాలే

నాగపూర్: కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. బిజెపి, మిత్రపక్షమైన ఎన్‌సిపికి చెందిన కొత్త వారికి ఇందులో చోటు దక్కవచ్చని అన్నారు. సోమవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిజెపిలో సంస్థాగతంగా జరుగుతున్న మార్పుల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్వవస్థీకరణ త్వరలో జరిగే అవకాశం ఉందన్నారు.

శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి (ఎస్‌పి) కూడా సిద్ధాంతపరమైన విభేదాలను పక్కనపెట్టి ప్రభుత్వంలో చేరాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి యత్నాలకు బలం చేకూర్చాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు తనతో పాటు గతంలో ఎన్‌డిఏ భాగస్వాములైన మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ ఉదాహరణలని అన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కన్వీనర్ అభిజీత్ దీప్కే సైతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలను నెరవేర్చేందుకు, సమాజాన్ని, పార్టీని బలోపేతం చేసేందుకు ఆర్‌పిఐ(ఎ)లో చేరాలని సూచించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లపై కూడా కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దానిని తొలగించాలని డిమాండ్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.