
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు
గాంధీ భవన్‌లో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్, మంత్రి తుమ్మల, ఎంపీ వేం భేటీ
నేడు జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేల మంతనాలు
పిసిసికి ఆశావాహుల పేర్లు పంపించండి: తుమ్మల సూచన
మన తెలంగాణ/హైదరాబాద్‌ః త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. శనివారం గాంధీ భవన్‌లో పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పార్టీ కోసం నిరంతరం పని చేసిన వారికీ గుర్తింపునిచ్చే విషయంపై వారు ప్రధానంగా చర్చించారు. గాంధీ భవన్‌కు వచ్చి కనిపించే వారికి, సిఫార్సులకు అవకాశం లేకుండా నిజమైన నాయకులను, కార్యకర్తలను గుర్తించే అంశంపై చర్చించారు. అయితే ఈ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు తమ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ కమిటీలను, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుని వడపోసి జాబితా రూపొందించి పిసిసికి నివేదించాల్సిందిగా సూచన చేయాలని నిర్ణయించారు.
కొత్త, పాత వారి ఎంపిక సీఎం, పిసిసి చీఫ్‌దే బాధ్యత
ఇదిలాఉండగా రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు ముప్పై కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు. అయితే వాటి పదవీ కాలం ఇటీవల ముగిసింది. వారి స్థానంలో ఎంత మంది కొత్త వారికి స్థానం కల్పించాలి?, ఎంత మంది చైర్మన్ల పదవులను రెన్యూవల్ చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి తుది నిర్ణయం తీసుకుంటారు.
విధి విధానాల రూపకల్పన
సమావేశంలో రాబోయే వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పిఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి విధి విధానాలు రూపొందించారు. ఉమ్మడి జిల్లాలకు ఉన్న ఇంచార్జ్ మంత్రి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ నాయకులతో సమావేశమై సమన్వయంతో ఆళావాహుల నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. ప్రధానంగా 60 శాతం నామినేటెడ్ పోస్టులను గత మండల అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గంలో పని చేసిన వారికి, అనుబంధ సంఘాల నాయకులకు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు ఇవ్వాలని నిర్ణయించారు. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని సంప్రదింపులు చేసి తుది జాబితాను సిద్ధం చేశాక, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కలిసి నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది..
నామినేటెడ్ పోస్టుల భర్తీః తుమ్మల
ఇదిలాఉండగా సమావేశానంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చర్చల అనంతరం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందన్నారు. ఆదివారం అన్ని జిల్లాల్లో ఇంచార్జీ మంత్రులు సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు సమన్వయం చేసుకొని ఆశావాహుల పేర్ల జాబితాలు సిద్ధం చేసి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, దేవాలయ, మార్కెట్ సహకార సంఘాలు, డైరెక్టర్ల పోస్టులన్నీ భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.











